జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల అంశం పై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. అయన మాట్లాడుతూ.. రాజధాని ఎక్కడ పెట్టినా తమకు అభ్యంతరం లేదని, అయితే.. అన్నీ ఒకే చోట ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని పేరుతో జిమ్మిక్కులకు తెరతీసిందని పవన్ ఆరోపించారు. మూడు రాజధానుల విషయంలో మొండిగా ముందుకెళ్తే ప్రభుత్వం గట్టి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరికాదన్నారు. రాజధాని ప్రాంత రైతులు వ్యక్తిని నమ్మి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. రాష్ట్రం కోసమే రైతులు భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా వైఎస్సార్‌సీపీ సహా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. రైతుల కన్నీటితో రాజధాని వద్దని ఆనాడు ప్రభుత్వానికి చెప్పా. ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది. అందుకే రైతులు భూములులిచ్చారు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. 


కర్నూలు, అమరావతి, విశాఖపట్నం.. ఈ మూడు నగరాల్లో రాజధాని ఎక్కడ పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. క్యాపిటల్ ప్రాంతంలోనే అన్నీ ఉండాలన్నారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ధైర్యముంటే ఏదో ఒక ప్రాంతంలోనే రాజధాని పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే రాజధాని అంశంపై నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు.


వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఇవన్నీ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని పవన్ విమర్శించారు. ఇంతో అంతో టీడీపీ పాలనే నయమని వ్యాఖ్యానించారు. నవరత్నాలు పథకాన్ని సరిగా అమలు చేయలేదు. ముందు రైతులకు న్యాయం చేయాలి. ప్రజలను విడగొట్టి పాలిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. రాజధాని ఎక్కడో ఒకచోట పెట్టాలనేదే మా డిమాండ్‌ అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: