ఏపీలో బీజేపీ - జనసేన పార్టీల పొత్తు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కొందరు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని మంచిపని చేశాడని సమర్థిస్తుంటే మరికొందరు బీజేపీ జనసేన పార్టీల పొత్తుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 
 
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పరిపాలనను వ్యతిరేకించడానికి బీజేపీ - జనసేన పార్టీలు కలిశాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బీజేపీ జనసేన పార్టీల పొత్తు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బీజేపీ జనసేన పార్టీలు జట్టు కట్టడం వలన వైసీపీ పార్టీ నాయకుల్లో వణుకు పుడుతోందని అన్నారు. బీజేపీ - జనసేన మద్దతు అమరావతి రైతులకు ఉంటుందని చెప్పారు. 
 
వైసీపీ నాయకులు ప్రధానమంత్రి మోదీ శంఖుస్థాపన చేసిన ప్రాంతాన్ని విడదీయాలని చూస్తున్నారని అది జరిగే పని కాదని వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలను అమలయ్యేలా కృషి చేస్తోందని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం మాత్రమే తాము బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా ఏపీ భవిష్యత్ ముఖ్యమని తేల్చి చెప్పారు. 
 
ప్రజా వ్యతిరేఖ విధానాలతో రాష్ట్ర అభివృద్ధి మరింత వెనక్కు వెళ్లిపోయిందని అన్నారు. బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా గళమెత్తుతాయని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని అన్నారు. జాతి ప్రయోజనాలు తమకు ముఖ్యమని జనసేన పార్టీ ఎప్పుడూ స్వార్థ రాజకీయాలు చేయదని నాదెండ్ల మనోహర్ అన్నారు. మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో భారత్ పేరు ఉన్నత శిఖరాలకు చేరిందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: