ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రాజకీయంగా  చెక్ చెప్పే అవకాశం జనసేనాని పవన్ కళ్యాణ్ కు మండలి రద్దు బిల్లు రూపం లో లభించింది  . శాసనమండలి ని రద్దు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే . ఈ మేరకు సోమవారం  అసెంబ్లీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది   .   మండలి రద్దు తీర్మానాన్ని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం  కేంద్రానికి నివేదించనుంది .  పార్లమెంట్ ఉభయ సభల్లో మండలి బిల్లుని ఎంత త్వరగా కేంద్రం ప్రవేశపెడుతుందన్న దానిపై , మండలి భవిష్యత్తు ఆధారపడి  ఉంది .

 

రాష్ట్ర ప్రభుత్వం మండలి వద్దనుకుని అసెంబ్లీ తీర్మానం చేసి , పార్లమెంట్ కు నివేదించిన నేపధ్యం లో ఉభయ సభలు తిరస్కరించే అవకాశం ఎంత మాత్రం లేదన్నది నిర్వివాదాంశమే . అయితే పార్లమెంట్ లో మండలి రద్దు బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారన్నదే ఆసక్తికరంగా మారింది . మండలి రద్దు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పవన్ కళ్యాణ్ , కేంద్రం తో తనకున్న సంబంధాలను వినియోగించుకుని బిల్లు ఉభయ సభల ముందుకు రాకుండా అడ్డుకునేందుకు అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .

 

ఇటీవల బీజేపీ తో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని , రాష్ట్రం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కు అడ్డుకట్ట వేయాలంటే మండలి రద్దు నిర్ణయం సత్వరమే అమలుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి . అయితే కేంద్ర ప్రభుత్వం , పవన్ మాటకు ఎంతవరకు ప్రాధాన్యత నిస్తుందన్నది హాట్ టాఫిక్ గా మారింది . కేంద్రానికి  ముందే చెప్పి ,  మండలిని  రద్దు చేయాలని   జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు కూడా రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి . మరి కేంద్ర పెద్దల వద్ద పవన్ కళ్యాణ్  మాట  చెల్లుబాటు అవుతుందా ?, జగన్మోహన్ రెడ్డి చెల్లుబాటు అవుతుందా ?? అన్నదిప్పుడు ఉత్కంఠ గా మారింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: