నెల్లూరు జిల్లా హరనాథపురంలోని 8వ అదనపు కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. 2013 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన నెల్లూరు జిల్లా హరనాథపురంలో మెడికో భార్గవి, ఆమె తల్లిని నిందితుడు ఇంతియాజ్ హత్య చేశాడు. అదే సమయంలో భార్గవి తండ్రి దినకర్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇంతియాజ్ మెడికో భార్గవి ఇంటీరియర్ వర్క్ కోసం పని చేశాడు. 
 
మెడికో భార్గవి ఇంట్లో నగదు, బంగారం ఉన్నాయని భావించి ఇంతియాజ్ వారి ఇంటిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడే సమయంలో భార్గవి, ఆమె తల్లి మృతి చెందారు. ఈ కేసులో ఇంతియాజ్ తో పాటు మరో ఇద్దరు మహిళలకు ప్రమేయం ఉండగా గతంలోనే కోర్టు ఇద్దరు మహిళలకు శిక్ష విధించింది. ఈరోజు నెల్లూరు అదనపు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇంతియాజ్ గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 
గతంలో అతనిపై రెండు కేసులు నమోదు కాగా ఆ కేసుల నుండి అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఒకవైపు నేరాలు చేస్తూనే మరోవైపు ఇంటీరియర్ డెకరేషన్ వర్క్ ఇంతియాజ్ చేసేవాడని తెలుస్తోంది. తన దగ్గర పని చేసే వారినే భాగస్వాములుగా చేసుకొని ఇంతియాజ్ నేరాలకు పాల్పడేవాడని తెలుస్తోంది. నిందితునికి ఉరిశిక్ష విధించటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 
 
2013లో ఈ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్య కేసులో మిగతా ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో జువైనల్ కోర్టు వాళ్లిద్దరికీ మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సుదీర్ఘ విచారణ తరువాత న్యాయస్థానం ఇంతియాజ్ కు ఈరోజు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన జరిగే సమయానికి భార్గవి మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతుండేది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: