భూమిపై పెట్టుబడి పెడితే ఎలాంటి నష్టం రాదన్నది పెద్దలు చెప్పే మాట. జనం పెరిగిపోతున్న రోజుల్లో నిరంతరం డిమాండ్ ఉండేది ఒక్క భూమికే. అందుకే అవకాశం ఉన్నప్పుడు భూమి కొనడం ఉత్తమ పెట్టుబడి అవుతుంది. అయితే భూమి కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 

అసలు భూముల్లో రకాలు ఏంటి.. వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకుందాం. గ్రామాల్లో ఉన్న భూమిని వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారు.. ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా..! ఒకే గ్రామానికి చెందిన భూమిని వేర్వేరు పేర్లతో ఎందుకు పిలుస్తారు, వాటి వివరాలు తెలుసుకుందాం.

 

గ్రామ కంఠం: గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు. గ్రామానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మించవచ్చు. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.

 

అసైన్డ్‌ భూమి: భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూములుగా పేర్కొంటారు. ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి గానీ, బదలాయించడానికి గానీ వీలుండదు. దీనినే లవాణీ పట్టా అని కూడా పిలుస్తారు.

 

AW భూములు: శిస్తును నిర్థారించిన భూములను ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్‌ వేస్ట్‌ ల్యాండ్‌ భూములు అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్‌ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.

 

బంజరుభూమి: గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

 

అగ్రహారం: పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

 

ఎకరం: ఇది భూమి విస్తీర్ణానికి సంబంధించిన కొలమానం. ఎకరం అంటే 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్ల స్థలం. (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు. (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం).

మరింత సమాచారం తెలుసుకోండి: