ఈనాడు దిన పత్రికపై తెలంగాణ సర్కారు మండిపడుతోంది. ఈనాడు తీరును తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ తీవ్రంగా విమర్శించారు. పోలీసులు, దొంగలు దోస్తి అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనంపై హోం మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో రాజకీయ జోక్యం ఉందని, దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవం అని మహమూద్‌అలీ స్పష్టం చేశారు.

 

 

రాజకీయ జోక్యంతో పోస్టింగ్‌లు ఇస్తున్నారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎలా స్టోరీలు రాస్తారని హోం మంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తా కథనం రాసి పోలీస్‌ ప్రతిష్ట దిగజార్చడం బాధాకరమన్నారు. ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు..ఎట్లా చేస్తున్నారు?..అన్న దేనికీ ఆధారాలు లేకుండా ఈనాడు కథనం రాసిందని అన్నారు. " నేను ఈనాడు ఎడిటర్‌, చీఫ్‌ ఎడిటర్‌కు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..ఈ ఆరోపణలు మీరు నిరూపించండి. లేదంటే క్షమాపణ చెప్పండి’ ” అని హోంమంత్రి మహమూద్‌అలీ సవాల్‌ విసిరారు.

 

 

అంతే కాదు.. ఆధారాలు నిరూపించకపోతే ఈనాడుపై రూ.వెయ్యికోట్లకు పరువునష్టం దావా వేస్తామని హోం మంత్రి మహమూద్‌ అలీ వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసుల ప్రతిష్టను దిగజార్చేందుకే ఈనాడు పత్రిక కుట్రపూరితంగా కథనం రాసిందని హోం మంత్రి మండిపడ్డారు. ఈనాడు రాసిన కథనాలతో ప్రజల్లో పోలీసులంటే విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు.

 

 

తెలంగాణ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర, పోలీస్‌ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈనాడు చేస్తున్న కుట్రలో భాగమే ఈ వార్తాకథనం అన్నారు. మీడియాలో వచ్చే కథనాలు సామాన్య ప్రజల నుంచి అందరూ విశ్వసిస్తారని, అలాంటి కథనాలు రాసేటప్పుడు ఆధారాలు లేకుండా రాయడం సరికాదని అలీ హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: