ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొవిడ్‌-19 వైరస్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కరోనా వైరస్‌పై తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ సృష్టించిన అత్యంత ప్రజాదరణ పొందిన కార్టూన్ క్యారెక్టర్ చోటా భీమ్ ద్వారా కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

 

చిన్నపిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్ క్యారెక్టర్ ద్వారా కరోనా వైరస్ లాంటి కీలకమైన, అత్యంత ఆవశ్యకమైన అంశం పైన ప్రజలను చైతన్య పరిచేందుకు ముందుకు వచ్చిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ సందర్భంగా అభినందించారు. ఈ చోట బీమ్ క్యారెక్టర్ ద్వారా చేపట్టిన ప్రచారం ముఖ్యంగా బడి పిల్లలు విస్తృత అవగాహనను పెంపొందిస్తుందని ఆశాభావాన్ని గ్రీన్ గోల్డ్ సంస్థ వ్యక్తం చేసింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు.

 

ఇదిలాఉండ‌గా,  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కొవిడ్‌-19 నియంత్రణపై అన్ని రాష్ట్రాల‌ మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇందులో మన రాష్ట్రం తరఫున వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా పాల్గొన్నారు. కరోనా పరీక్షలు, ఐసొలేషన్‌ వార్డులు, ల్యాబ్‌ల ఏర్పాటుపై కేంద్ర మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హర్షవర్ధన్‌ అభినందించారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఎన్‌- 95 మాస్కులను రాష్ట్రాల‌కు పంపిణీ చేయాలని, తెలంగాణలో మరో ల్యాబ్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం వైరస్‌ నియంత్రణపై కేంద్రమంత్రి పలు సూచనలుచేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని కితాబిచ్చారు. మిగతా రాష్ట్రాల‌కు కూడా తెలంగాణను అనుసరించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: