కరోనా వైరస్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల  ఎన్నికలను , ఎన్నికల కమిషన్ వాయిదా వేయాలని నిర్ణయించింది . ఈసీ నిర్ణయాన్ని అధికార పార్టీ తప్పు పడుతుంటే , ప్రతిపక్షాలు స్వాగతిస్తూనే , ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి . అయితే ఎన్నికల వాయిదా వల్ల ఎవరికి లాభం , ఎవరికీ నష్టమనేది  ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు   హాట్ టాఫిక్ గా మారింది . రాజకీయ పార్టీల ప్రస్తావన పక్కన పెడితే అభ్యర్థులకు మాత్రం ఈ ఆరు వారాలు కష్టకాలమనే చెప్పాలి .

 

ఎందుకంటే ఆరువారాల పాటు పార్టీ క్యాడర్ తో పాటు ఓటర్ల అవసరాలను  తీర్చాల్సిందే . లేకపోతే వారు తమదారి తాము చూసుకునే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ లో  ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆరెస్ అభ్యర్థులు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొన్నారు . అసెంబ్లీని రద్దు చేస్తూనే,  టీఆరెస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు . అయితే ఆయన ఊహించినట్లుగా కాకుండా అసెంబ్లీ  ఎన్నికల నిర్వహణ  రెండు నెలల ఆలస్యం కావడంతో , అభ్యర్థులంతా పార్టీ క్యాడర్ ను కాపాడుకోలేక ఆర్ధిక  అపసోపాలు పడ్డారు. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థులు  ఎదుర్కొన్న పరిస్థితినే  , ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్  స్థానిక ఎన్నికల్లో అధికార , ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అభ్యర్థులంతా ఎదుర్కోవాల్సిన  పరిస్థితి నెలకొంది .

 

దీనితో పార్టీలతో ప్రమేయం లేకుండా  అభ్యర్థుల  జేబులు గుల్ల కావడం ఖాయంగా కన్పిస్తోంది . ఇక స్థానిక ఎన్నికలకు ముందే ఎలాగో  ప్రతిపక్షాలు చేతులెత్తేయడం చూస్తే , అధికార పార్టీ అభ్యర్థులకు మాత్రం ఆర్థికభారం తడిచి మోపెడయ్యేలా ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఆరు వారాల తరువాత అయిన ఎన్నికల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశాలేమి లేవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: