తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల తీరే వేర‌ప్పా..!  ప్ర‌త్య‌ర్థిని ఒక‌రు తిడితే.. మ‌రొక‌రు పొగుడుతారు!  రాజ‌కీయ శ‌త్రువుపై ఒక‌రు పంచ్‌లు విసిరితే.. మ‌రొక‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తారు..! ఆహా.. చూశారా.. ఒక‌రిపై మ‌రొక‌రికి న‌మ్మ‌కాలు ఉండ‌వు.. ఇక వీళ్ల‌ను జ‌నం ఎలా న‌మ్మాలి..! అందుకే  మొన్న‌టికి మొన్న ఓ జీవో విష‌యంలో, మంత్రి కేటీఆర్‌కు చెందిన బంధువుల ఫాంహౌస్ విష‌యంలో ఎంపీ రేవంత్‌రెడ్డి ఒక‌టి చెబితే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రొక‌టి వాదించారు. ఇదేంద‌య్యా అంటే.. అరే.. ఇది మా వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మంట‌రు! ఇక సీఎం కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బుధ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు.. ఇక ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట్లు చెప్పారు. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేయ‌డాన్ని వ్య‌క్తిగ‌తంగా స్వాగ‌తిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక్క‌డితోనే ఆగ‌కుండా.. మ‌రో నాలుగైదు సూక్తులు కూడా ప‌లికారు. గ‌తేడాది జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌విత‌కు ఆశించిన ఫ‌లితం రాలేద‌ని ఆయ‌న అన్నారు. ఓట‌మి రాజ‌కీయ జీవితానికి ముగింపు కాద‌ని, అది మ‌రింత బాధ్య‌తాయుత‌మైన ప్ర‌జాప్ర‌తినిధిగా తీర్చిదిద్దుతుంద‌ని అన్నారు.

 

సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యురాలైనంత‌మాత్రాన క‌విత ఎమ్మెల్సీ కారాద‌న్న నిబంధ‌న ఏదీ లేద‌ని జీవ‌న్‌రెడ్డి అన్నారు. పార్టీకి ఆమె సేవ‌లు అవ‌స‌రం ఉన్నందునే అవ‌కాశం క‌ల్పించి ఉండ‌వ‌చ్చున‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌విత ఎమ్మెల్సీగా జిల్లాకే ప‌రిమితం కాకుండా రాష్ట్ర‌వ్యాప్తంగా సేవ‌లు విస్త‌రించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఆహా.. మాజీ ఎంపీ క‌విత‌పై ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డికి ఎంత సానుభూతి ఉంది.. అంటూ కాంగ్రెస్ శ్రేణులు లోలోప‌ల మండిప‌డుతున్నాయి. అక్క‌డ అధికార పార్టీ మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఫైట్ చేస్తూ జైలు పాలై బెయిల్‌.. బెయిల్.. అంటూ మొత్తుకున్నారు.. చివ‌రికి బెయిల్ దొర‌క‌డంలో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.. అదంతా మ‌రిచిపోయి, మాజీ ఎంపీ క‌విత‌పై జీవ‌న్‌రెడ్డి సానుభూతి చూపిస్తూ మాట్లాడ‌డంతో నేత‌ల తీరు చూసి.. కాంగ్రెస్ శ్రేణులు న‌వ్వుకుంటున్నాయి. అయినా.. అసెంబ్లీకి జ‌రిగిన‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో జీవ‌న్‌రెడ్డిని ఓడించ‌డంలో క‌విత కీల‌క పాత్ర పోషించిన విష‌యాన్ని జీవ‌న్‌రెడ్డి అప్పుడే మ‌రిచిపోయారా..? అంటూ ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. కొంప‌దీసి.. ఈయ‌న కూడా గులాబీ గూటికి చేరుతారా..? ఏమిటి.. అంటూ ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏమో.. ఇక ఈ కాంగ్రెస్ నేత‌ల తీరును మార్చ‌డం ఎవ‌రిత‌రం కాదేమో..!

మరింత సమాచారం తెలుసుకోండి: