గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో, వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కరోనా గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. కానీ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఈరోజు కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 
 
దాదాపు నెలరోజుల నుండి మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాల గురించి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. సుప్రీం ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. సుప్రీం ప్రభుత్వానికి విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం ఈరోజు సాయంత్రంలోగా బలపరీక్ష చేపట్టాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. 
 
నిన్న అర్ధరాత్రి స్పీకర్ ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించగా అంతకు ముందే మరో 16 మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. స్పీకర్ రాజీనామాలను ఆమోదించటంతో అసెంబ్లీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సభలో మెజారిటీకి కావాల్సిన సభ్యుల సంఖ్య 104 కాగా కాంగ్రెస్ కు 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. బీజేపీకి మొత్తం 112 మంది సభ్యుల మద్దతు ఉందని సమాచారం. 
 
సభలో సమీకరణలు పూర్తిగా మారిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం బల పరీక్షలో గెలిచే అవకాశం లేదని తెలుస్తోంది. సీఎం కమల్ నాథ్ విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ వర్గాలు ముందే రాజీనామా చేయడం మంచిదని సూచించటంతో సీఎం రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎం పార్టీ ముఖ్య నేతలతో, మంత్రులతో మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం సంక్షోభంలో పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: