ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. నిన్న మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో మర్కజ్ మూలాలే కొంప ముంచాయి. అంతకంతకు కేసులు పెరుగుతుండటంతో ఇటు జనంలోనూ, అటు అధికారుల్లో కలవరం రేపుతోంది. ఇంతవరకు తమవాళ్లలో ఏ ఒక్కరికి వ్యాధి సోకిన దాఖలాలు లేకపోయినా, పట్టణ వాసులవల్లే తమ ప్రాంతంలో కొందరికి కరోనా సోకడం ఆదివాసీల్లో కలకలం రేపుతోంది. 

 

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడగ విప్పింది. పట్టణాల్లో తిష్టవేసిన కరోనా మహ్మరి ఇప్పుడు పచ్చని పల్లెలను వదలిపెట్టడం లేదు.  ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కరోనా కేసులు నిర్థారణ అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనేకాదు పల్లె ప్రాంతాల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మెుత్తం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా  ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో  ఒక వృద్దురాలికి ప్రైమరీ కాంటాక్టర్ ద్వారా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ 19 కేసుల్లో సగానికి పైగా బాధితులు పట్టణ ప్రాంతానికి చెందివారున్నారు. మిగతావారు మాత్రం పల్లె ప్రాంతాలకు చెందినవారే. 


 
నిర్మల్, బైంసా, ఆదిలాబాద్ టౌన్ లతో కలిపి 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పల్లె ప్రాంతాల్లో చూస్తే  17 కేసులు నమోదు అయ్యాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి.  ఇక ఆదిలాబాద్ జిల్లా మొత్తం 14 కేసులు, జిల్లా కేంద్రంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేరేడిగొండ మండలంలో మూడు,  ఉట్నూర్ మండలం హస్నాపూర్ లో ఒక్కటి నమోదు అయ్యాయి..ఇక కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కావడం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలను కలవరపరుస్తోంది. 

 

ఇన్నాళ్ల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోకి కరోనా నీడకూడా కనిపించలేదు. ఇప్పుడు ఒకే ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటీవ్ రిజల్ట్ రావడంతో అందరూ ఖంగుతిన్నారు. తర్వాత ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా జైనూర్ లో మరొక్కరికి పాజిటీవ్ నిర్థారణ కావడంతో అధికారులు అవాక్కయ్యారు.ఇక మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో ఓమహిళకు కరోనా నిర్థారణైంది..ఆమె అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. వైద్య పరీక్షలు నిర్వహించగా,  కరోనా నిర్థారణ కావడం అధికారుల్లో టైన్షన్ మొదలైంది. 

 

లాక్ డౌన్ ను పట్టణ ప్రాంతాలకంటే పల్లెలు, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాటిస్తున్నారు.ఏ అధికారి చెప్పినా చెప్పకున్నా..గ్రామస్థాయిలో కట్టడి చర్యలు తీసుకుంటూ పొలిమేరల్లోనే కరోనాకు బ్రేక్ వేస్తున్నారు. ప్రతి గూడెంలో దారులు మూసేసి బయట వ్యక్తులను రానివ్వకుండా,  లోపలి వాళ్లను బయటకు వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.  

 

పట్టణాల్లో విద్యావంతులతో పోలిస్తే,  ఏజెన్సీ ప్రాంత వాసులు స్వీయ నిర్భందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు నడుం మోగించారు. తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహమ్మారి తమ గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: