లాక్ డౌన్‌ అమల్లోకి వచ్చి నెలరోజులు దాటింది. ఉపాధి లేక పేదలు తిండికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌.. 12 కిలోల బియ్యం, 1500 రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. కానీ అవి అందరికీ పూర్తిగా అందలేదు. దీంతో పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

 

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్యాకేజీ ప్రకటించారు. మనిషికి 12కిలోల బియ్యం, కుటుంబానికి 1500 రూపాయల ఆర్ధిక సాయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సుమారు 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వసాయం కొందరికి అందలేదు. సుమారు 6 లక్షల మందికి సాయం అందలేదని అంచనా వేస్తున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి.

 

రేషన్‌ తీసుకునే క్రమంలో వేలిముద్ర వేస్తే వైరస్‌ వస్తుందన్న అనుమానంతో అధికారులు సాప్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేశారు. దీనిలో భాగంగా పీవోఎస్‌ మిషన్‌లో ఆహార భద్రత కార్డు నంబరు నమోదు చేసి, డీలరు వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఈ నమోదు ప్రక్రియలోనే ప్రస్తుతం పొరపాట్లు జరుగుతున్నాయి. లబ్దిదారులకు అందకుండానే సాప్ట్‌వేర్‌లో తీసుకున్నట్టు నమోదు అవుతోంది. ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఈ నెలలో 91 శాతం మంది రేషన్‌కార్డుదారులు బియ్యం తీసుకున్నారు. ప్రతి నెల సగటు కన్నా ఇది ఆరు శాతం ఎక్కువ అని పౌరసరఫరాల సంస్థ తెలిపింది. 

 

రేషన్‌ పంపిణీ చేపట్టిన మొదట్లో ప్రజల తాకిడి భారీగా ఉంది. తొలి నాలుగు రోజుల్లోనే 12 లక్షల 50వేల మంది బియ్యం తీసుకున్నారు. దీంతో కొన్నిచోట్ల ఒక కార్డు నంబరుకు బదులు మరో నంబరు నమోదు చేసి సరుకులు పంపిణీ చేసినట్లు సమాచారం. 15.63 లక్షల మంది పోర్టబులిటీ విధానంలో బియ్యం తీసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చౌకధరల దుకాణాల పరిధిలో నంబర్లు తప్పుగా నమోదుకావడంతో ఈ సమస్య వచ్చింది. రేషన్‌ ఎక్కడ పొందినట్లుగా ఉందో ఆ వివరాలను చెప్పి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నామని డీలర్స్ చెబుతున్నారు.

 

రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 79.57 లక్షల మందికి బియ్యం పంపిణీ పూర్తయిందని  తెలిపారు. పౌర సరఫరాల శాఖ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. 74 లక్షల కుటుంబాలకు నగదు బదిలీ చేశామన్నారు. మిగతా 5 లక్షల 21 వేల మందికి బ్యాంక్ అకౌంట్ లేనందున వీరికి పోస్ట్ ఆఫీస్ ద్వారా నగదును అందిస్తున్నట్టు తెలిపారు. ఇక 3 లక్షల 35వేల మంది వలస కార్మికులను తొలి విడతలో గుర్తించినట్టు తెలిపారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం..5 వందల రూపాయల సాయాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: