హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ప్రేమికులు డేవిడ్, రూప కొన్నేళ్ల క్రితం కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరి అన్యోన్య వైవాహిక బంధంలో ఓ పండంటి బాబు పుట్టాడు. ఐతే గత ఏడాది మార్చి 23వ తేదీన తమ బాబు బర్త్ సర్టిఫికెట్ కోసం కొత్తపేట మున్సిపాలిటీ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడి అధికారులు మాత్రం ఆ పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. కారణం ఏంటో అర్థం కాని ఆ దంపతులు అధికారులను సంప్రదించగా... కులం మతం కోసం ప్రత్యేకించబడిన కాలములలో ఏ సమాచారమును ఇవ్వలేదని అందుకే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరలేదని తెలిపారు. దాంతో పెదవి విప్పిన దంపతులు... మా ఇద్దరి కులాలు వేరు మతాలు కూడా వేరే. అటువంటప్పుడు మా కుమారుడికి ఏ కులం ఏ మతం రాయంచమంటారు? అని అధికారులను ప్రశ్నించారు. సమాధానంగా... మీ ఇష్టం. ఏదో ఒక కులం, ఏదోక మతం రాయించండి. అలా చేయకపోతే మేము బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేము అని కుండబద్దలు కొట్టి అధికారులు చెప్పారు.


వారి సమాధానం రుచించని ఆ దంపతులు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. కులాంతర మతాంతర పెళ్లి చేసుకున్న దంపతులు మేము... మా పిల్లల జనన సర్టిఫికెట్ కోసం ఏ కులం, ఏ మతం రాయమంటారని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (Public interest litigation) పిటిషన్ వేశారు. ఆ లిటిగేషన్ లో తమ హక్కులను, మనోభావాలను దెబ్బతీయకుండా... తమ పిల్లల జననం మొదలు మరణం వరకు ప్రభుత్వం ఇచ్చే ఏ సర్టిఫికెట్ లో అయినా  (No religion - No Caste) వారిని కులం మతం లేని వాళ్ళు గా గుర్తించాలని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం... డేవిడ్, రూప డిమాండ్ పై కౌంటర్ దాఖలు చేయాలని బర్త్ సర్టిఫికెట్ అందించే అధికారులకు, స్టేట్ గవర్నమెంట్ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపించారు. తదుపరి విచారణ జరిపేందుకు నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.


ఈ విషయంపై దంపతులు మాట్లాడుతూ కుటుంబ మతం కాలము నింపేందుకు తాము నిరాకరించామని... దాంతో అధికారులు ఒక సంవత్సరం గడుస్తున్నా తమ కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని అందుకే కలెక్టర్ ని, ఆపై అధికారులను కలిశామని తెలియజేశారు. తాము కులమతాలకు అతీతంగా జీవిస్తున్నామని.. తమలాగే ఎంతో మంది జీవిస్తున్నారని వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: