ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న కరోనా క‌ల‌క‌లంపై షాకింగ్ ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992. వ్యాధి నుంచి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు. ఇలాంటి త‌రుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మ‌హ‌మ్మారి ఎప్పటికీ కనుమరుగు కాకపోవచ్చని పేర్కొంది.

 

డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ అధిపతి డాక్టర్‌ మైఖెల్‌ రియాన్ క‌రోనా గురించి స్పందిస్తూ కరోనా ఎప్పటిలోపు కట్టడి చేయగలమన్న విషయాన్ని చెప్పడం సాధ్యంకాదని తెలిపింది. కొవిడ్‌-19 ఎప్పటికీ కనుమరుగు కాకపోవచ్చు. వ్యాక్సిన్‌ లేకుండా ఈ మహమ్మారిని అడ్డుకునే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రజలకు ఏళ్ల‌ సమయం పడుతుంది. వివిధ వైరస్‌లతో జీవిస్తున్నట్టుగానే దీనితో కలిసి జీవించాల్సి రావొచ్చు’ అని అన్నారు. హెచ్‌ఐవీ వ్యాధి లాగానే ఇది కూడా కనుమరుగు కాకపోవచ్చన్న ఆయన సమర్థమంతమైన చికిత్సను అందించి వ్యాధితో సహజీవనం చేస్తూ ప్రజల్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

 

ఇదిలాఉండ‌గా, కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి. అమెరికా-85,197, స్పెయిన్‌-27,104, రష్యా-2,212, యూకే-33,106, బ్రెజిల్‌-13,158, ఫ్రాన్స్‌-27,074, జర్మనీ-7,861, టర్కీ-3,952, ఇరాన్‌-6,783, చైనా-4,633, పెరూ-2,169, కెనడా-5,302, బెల్జియం-8,843, నెదర్లాండ్స్‌-5,562, మెక్సికో-4,220, ఈక్విడార్‌-2,334, స్విట్జర్లాండ్‌-1,870, పోర్చుగల్‌-1,175, స్విడన్‌-3,460, ఐర్లాండ్‌-1,497, రోమేనియా-1,036, ఇండోనేషియాలో 1,028 వ్యాధి కారణంగా చనిపోయారు. మరోవైపు,  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుతున్న వేళ‌.. కొన్ని దేశాలు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తున్న దేశాలు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. వైర‌స్ వేగాన్ని త‌గ్గించ‌డంలో కొన్ని దేశాలు స‌ఫ‌లం అయ్యాయ‌ని, దీని వ‌ల్ల ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడారని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: