చరిత్రను తిరగరాస్తూ అఖండ విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ప్రమాణం చేసి ఏడాది పూర్తయ్యింది. అద్భుత విజయానికి అనుగుణంగా.. ఈ సంవత్సరకాలంలో వినూత్న నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో తన మార్క్‌ను చూపించారు జగన్‌. అలాంటి పథకమే మత్స్యకార భరోసా. దీని ద్వారా గంగపుత్రులకు ఆర్థిక అండను అందిస్తోంది ప్రభుత్వం. 

 

సంక్షేమం అంటే సర్కార్‌...  సర్కార్‌ అంటేనే సంక్షేమం అన్నట్టుగా సాగుతోంది ఏపీలో జగన్‌ పాలన. మొదటి ఏడాదిలోనే పాలనపై తనదైన ముద్ర కనిపించేలా చేసిన జగన్మోహన్‌రెడ్డి... ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా.. మత్స్యకారుల జీవితానికి భరోసా కల్పించేందుకు కొత్త స్కీమ్‌ ను తీసుకొచ్చారు. వేట నిషేధం ఉన్న సమయంలోనూ వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. ఆ సమయంలో మత్స్యకుటుంబాలు ఉపాధిలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఆ ఇబ్బందుల్ని తొలగించేందుకు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే రెట్టింపు భత్యం ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు జగన్‌. అధికారంలోకి రాగానే.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ మత్స్యకార భరోసా పేరుతో ఆర్థిక లబ్ది చేకూరుస్తున్నారు.

 

ఈ పథకంతో చేపల వేటపై నిషేధం ఏప్రిల్‌ 15 నుంచి జూన్ 14 మధ్య... మత్స్యకారులకు ఈ పథకం ద్వారా పది వేల రూపాయల ఆర్థికసాయం అందుతుంది. ఇప్పటికే రెండు సార్లు అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లోకి పది వేల రూపాయల చొప్పున జమయ్యాయి.  2015లో అప్పటి టీడీపీ సర్కార్‌.. 65వేల మంది లబ్దిదారులకు రెండు వేల చొప్పున ఆర్థికసాయం ఇచ్చింది. ఆ తర్వాత అది నాలుగువేలకు పెరిగింది. దీంతో, అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి ... ప్రతి మత్స్య కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఇప్పుడు మాట నిలుపుకోవడంతో.. మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

గతంలో  80వేలుగా ఉన్న లబ్దికారుల సంఖ్య ప్రస్తుతం లక్షా 2వేల 478 మందికి చేరింది. దీంతో 2019లో మత్స్యకుటుంబానికి అందిన సాయం ఆమాంతం 102 కోట్ల 47 లక్షల 80 వేలకు పెరిగింది. ప్రభుత్వ ఖజానాకు ఈ మొత్తం భారంగా మారుతుందని అధికారులు లెక్కలేసి చెప్పినా.. సీఎం జగన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇక 2020లో లబ్దిదారుల సంఖ్య .. 1,09,231 కు పెరిగింది. దీంతో ఆర్థికసాయం 110 కోట్లు ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో వేసింది.  గతంలో రిజిస్టర్‌ చేసుకున్న మత్స్యకారులకే ఆర్థికసాయం అందేది. ఇప్పుడు మాత్రం.. చిన్న చిన్న బోట్లతో సముద్రంలో వేటకు వెళ్లే వారికి లబ్ది చేకూరుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: