దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మూడో విడత సడలింపుల్లో మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం నాలుగో విడత సడలింపుల్లో భాగంగా భారీ సడలింపులు ఇచ్చింది. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఓపెన్ అయ్యాయి. నగలు, వస్త్రాల దుకాణాలకు కూడా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. 
 
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, ప్రజా రవాణా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. జన సాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, థియేటర్లు, ప్రార్ధనా మందిరాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో జూన్ 1వ తేదీ నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నట్టు సీఎం యడ్యూరప్ప వెల్లడించారు. 
 
రాష్ట్రంలో 50 ప్రముఖ దేవాలయాలకు ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు. మే 31వ తేదీ లోపు రాష్ట్రంలోని మందిరాలలో భారీగా మార్పులు చేస్తామని అన్నారు. మంత్రి కోటా శ్రీనివాస్ పూజారీ మాట్లాడుతూ భక్తులు కరోనా మార్గ దర్శకాలను పాటిస్తూ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. ఉత్సవాలు, పర్వ దినాలు జరుపుకునేందుకు మాత్రం అనుమతులు ఇవ్వడం లేదని ప్రకటన చేశారు. 
 
గతంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన కర్ణాటక రాష్ట్రంలో నిన్నటివరకు 2182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 44 మంది కరోనా వైరస్ భారీన పడి మృత్యువాత పడ్డారు. కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. కర్ణాటకలోని దేవాలయాలలో జూన్ 1వ తేదీ నుంచి భక్తులకు అనుమతులు ఇస్తూ ఉండటంతో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: