ఏపీలో పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, తమిళనాడుల్లో పరీక్షలు రద్దు చేసి అందరినీపాస్ చేసేశారు.. ఏపీలోనూ కూడా అలాగే చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ మెస్సేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి..

 

"జగన్ గారు, మా బిడ్డల ప్రాణాలు కాపాడండి..

దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకీ ఉధృతమవుతోంది. ఏపీలో కూడా పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. ఈ రోజుకు మరణాల సంఖ్య 82కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,591.

 

మీ ఇరుగు, పొరుగు తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులకు విముక్తి కలిగించాయి.. మీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షల బాధ్యతను పక్కనపెట్టలేదు. ఆరు నూరైనా.. పదో తరగతి పరీక్షలు నిర్వహించి తీరుతామంటున్నారు, విద్యాశాఖ అమాత్యులు ఆదిమూలపు సురేష్.

 

పరీక్షల్లో మార్కుల సంగతి దేవుడెరుగు, పిల్లాడు కరోనా బారిన పడకుండా ఉంటే అదే చాలు.. ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేసినా, శానిటైజర్లు, మాస్కులు ఇచ్చినా కూడా. విద్యార్థులంతా ఓచోట గుమికూడే సమయంలో ఒక్కరికి వైరస్ వచ్చినా మిగతావాళ్లంతా బలైపోతారు.’ అని ఆందోళన వ్యక్తం చేస్తోంది, విశాఖ కు చెందిన ఒక విద్యార్థి తల్లి.

 

చాలా రోజులుగా విద్యార్థులు ఒకరికొకరు దూరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు పరీక్షల పేరుతో ఒక్కచోట చేరితే , వారిని కలవకుండా ఆపలేరు. ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ అవసరమా…” అని ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు.

 

విద్యార్థులు పరీక్షలు రాసి వెళ్లిపోతారు. ఆ తర్వాత పేపర్లను సేకరించడం, ఒకేచోట పెట్టడం, తిరిగి ప్యాక్ చేసి పంపించడం వంటివన్నీ టీచర్ల పనే. అందుకే మాకు రిస్క్ ఎక్కువ. ఇన్నిరోజులు ఇంట్లో ఉండి కరోనాకి దూరంగా జాగ్రత్తలు తీసుకుంటున్న మేము ఇప్పుడు పదో తరగతి పరీక్షల కోసం బైటకొచ్చి వైరస్ బారిన పడితే కుటుంబం పరిస్థితి ఏంటి? ‘అని తీవ్ర ఆందోళనగా అడుగు తున్నారు, కర్నూల్ కు చెందిన ఉపాధ్యాయులు.

 

ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు..

 

1, పిల్లల ప్రాణాలకన్నా పదోతరగతి పరీక్షలు ఏమీ ముఖ్యంకాదు. వాళ్ళని ఇంటర్ కి ప్రమోట్ చేస్తే వచ్చే విశ్వప్రళయం ఏమీ లేదు. కాబట్టి ఈ పదోతరగతి పరీక్షల ఆలోచన ప్రభుత్వం మానుకుంటే చాలా మంచిది.

 

2, కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు కాబట్టి, పరీక్షలు వాయిదా వేయడం వల్ల సమయం వృధా. తెలంగాణలో లాగా ఆల్ పాస్ చేయాలి.

 

3, ఒకవేళ పరీక్షలు మొదలైనా.. మధ్యలో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ఆ ఎగ్జామ్ సెంటర్ పరిస్థితి ఏంటి? మధ్యలో పరీక్షలు వాయిదా వేయాలన్నా కష్టమే. అందుకే ఇప్పుడే , పూర్తిగా పరీక్షలు రద్దు చేయాలి.

 

-శ్యామ్ మోహన్, రూరల్ మీడియా

 

మరింత సమాచారం తెలుసుకోండి: