ఏపీ రాజకీయాల్లోకి నందమూరి వారసురాలు ఎంట్రీ ఇవ్వనుందా? అంటే ఇవ్వాలిసిందే అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. ప్రస్తుతానికి నందమూరి కుటుంబానికి చెందిన వారు టీడీపీలో ఉన్నది నందమూరి బాలకృష్ణ, నందమూరి సుహాసినిలు మాత్రమే.  బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటే, నందమూరి సుహాసిని తెలంగాణ టీడీపీలో కీలకంగా ఉన్నారు. నందమూరి హరికృష్ణ చనిపోవడం, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో చంద్రబాబు...టీడీపీకి కంచుకోటగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గంలో హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీకి దించారు.

 

అయితే అనూహ్యంగా సుహాసిని ఓటమి పాలయ్యారు. ఇక తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ కనీసం ఒక ఎం‌పి‌టి‌సి సీటుని కూడా గెలిచే స్థితిలో లేదు. ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నలుగురైదుగురు నేతలు మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సుహాసిని కూడా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

కాకపోతే సుహాసిని తెలంగాణలో ఉండటం వల్ల ఏం ఉపయోగం ఉండదని, ఆమెని ఏపీ రాజకీయాల్లోకి తీసుకురావాలని తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. తెలంగాణలో మన పార్టీకి భవిష్యత్ లేదని, కాబట్టి ఆమెని ఏపీ రాజకీయాల్లోకి దించాలని అంటున్నారు. అది కూడా కృష్ణా రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుందని, ఎలాగో ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కాబట్టి సుహాసినికి ఇక్కడే సీటు కేటాయిస్తే పార్టీకి బెన్‌ఫిట్ జరుగుతుందని చెబుతున్నారు.

 

ఇప్పుడు ఎలాగో గన్నవరం సీటు ఖాళీగా ఉందని, అక్కడ వంశీకి సరైన అభ్యర్ధి టీడీపీలో లేరని, అదే సుహాసినికి గన్నవరం సీటు ఇస్తే తిరుగుండదని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదంతా బాబు తలుచుకుంటేనే జరుగుతుందని, తెలంగాణలో పార్టీకి భవిష్యత్ తక్కువ కాబట్టి, సుహాసినిని ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తేనే పార్టీకి లాభం ఉంటుందని, అది కూడా గన్నవరం సీటు బరిలో దించితే ఇంకా మంచిదని తమ్ముళ్ళు  స్ట్రాంగ్‌గా చెబుతున్నారు. మరి చూడాలి తమ్ముళ్ళ డిమాండ్‌ని బాబు పట్టించుకుంటారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: