నాలుగు దశాబ్దాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదనే చెప్పొచ్చు. పార్టీ ఆవిర్భావంలో యువ నేతలుగా ఉన్నవారంతా ఇప్పుడు వృద్ధ నేతలు అయిపోయారు. దీంతో పార్టీకి యువ రక్తం అవసరముందని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఇక ఆ మేరకు ఆయన ముందుకు కూడా వెళుతున్నారు. అందులో భాగంగానే వృద్ధ నేతలని సైడ్ చేసి యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు చూస్తున్నారు. ఆఖరికి తాను కూడా సైడ్ అయిపోయి కుమారుడు నారా లోకేష్‌కు పెత్తనం అప్పగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

 

అయితే కేవలం చంద్రబాబే కాకుండా మిగతా సీనియర్ నేతలు కూడా, రాజకీయాల నుంచి నిదానంగా తప్పుకుని తమ వారసులని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని వారసులని బరిలోకి దించారు. కాకపోతే ఫలితాలు అనుకూలంగా రాలేదు అంతే. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మరికొందరు సీనియర్ నేతలు కూడా సైడ్ అయిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా నెక్స్ట్ ఎన్నికల బరిలో ఉండరని జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జ్యోతుల..జగ్గంపేట నుంచి 1994,1999 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక 2004లో ఓడిన జ్యోతుల, 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించి, తర్వాత టీడీపీలోకి వచ్చేశారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.

 

అయితే జ్యోతుల వయసు మీద పడటంతో నెక్స్ట్ ఎన్నికల బరిలో ఉండరని, ఆయన స్థానంలో తనయుడు జ్యోతుల నవీన్ పోటీ చేయొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే జ్యోతుల పోటీ నుంచి తప్పుకునే విషయంలో ఇంకా ట్విస్ట్ ఉంటుందని, చివరి నిమిషంలో ఆయనే మళ్ళీ పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: