ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించనుంది. కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 
 
ఒక్కో కోవిడ్ కేర్ సెంటర్ లో ఈసీజీ, ఎక్స్‌రే, ల్యాబ్ టెస్ట్‌లు వంటి అన్ని డయాగ్నోస్టిక్ సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నవాళ్లు కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచనలు చేశారు. 10 - 60 సంవత్సరాల మధ్య వయసు వారు హోం ఐసోలేషన్ లో ఉండవచ్చని తెలిపారు. 
 
తీవ్ర లక్షణాలు, డయాబెటిస్, రక్త పోటు, సీఓపీడీ వంటి వ్యాధులతో బాధ పడేవారిని మాత్రం కరోనా ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఇంట్లో ఉన్న ఐసోలేషన్ రోగుల పల్స్, బీపీ, ఎస్పీఓ 2 (ఆక్సిజన్ శాతం), బ్లడ్ షుగర్ కోసం తమను తాము పరీక్షలు చేసుకొని పర్యవేక్షించుకోవాలని... ఇండుకోసం ఏ.ఎన్.ఎంలు సహాయం చేస్తారని చెప్పారు. టెలీ కన్సల్టేషన్ కేంద్రాల ద్వారా ఇంట్లో ఉన్న ఐసోలేషన్ రోగులను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. 
 
హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తికి ఇబ్బంది కలిగితే అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం కరోనా ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు. హోం ఐసోలేషన్ 28 రోజుల్లో పూర్తైన తరువాత కరోనా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ అయినా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవచ్చని పేర్కొన్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం హోం ఐసోలేషన్ ద్వారా కూడా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: