కరోనా వైరస్ విజృంభణ వల్ల వైరస్ పేరు వింటేనే ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లంపీ స్కిన్ డిసీజ్ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వల్ల మనుషులకు ఏ ప్రమాదం లేకపోయినా జంతువులకు మాత్రం ప్రమాదమేనని తెలుస్తోంది. మే-జూన్ నెలల్లో రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఈ వైరస్ విజృంభించింది.
 
తాజాగా అదిలాబాద్ జిల్లా రైతులను వైరస్ గజగజా వణికిస్తోంది. ఒక మూగజీవి మరో మూగజీవికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత, మందులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 40 రోజులుగా అదిలాబాద్ జిల్లాలోని పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి బయటపడుతోంది. లంపీ స్కిన్ బారిన పడిన మూగజీవాల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
 
ఆవులు, ఎద్దులు, దూడలకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది. వ్యాధి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే పశువులు వైరస్ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మెడికల్ దుకాణాల నుంచి మందులను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పశువుకు 1500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
 
జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వం లంపీ స్కిన్ వ్యాధిని నిర్మూలించే వ్యాక్సిన్లను సరఫరా చేసింది. ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మందుల సరఫరాను నిలిపివేసింది. మరోవైపు పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న తలమడుగు ప్రాంతంలో లంపీ స్కిన్ వల్ల ఒక ఎద్దు చనిపోయింది. వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకోలులో కొద్ది రోజుల వ్యవధిలోనే 11 మూగజీవాలు లంపీ స్కిన్ వల్ల చనిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: