రాజధాని ఢిల్లీలో ఒక యువతి ఒక కామాంధుడు వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుందని తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఎవరూ లేనిది చూసి ఇంట్లోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువతిని కుటుంబసభ్యులు కాపాడారు. అప్పటికే ఆమె పరిస్థితి చాలా విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కాని వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ప్రాణాలు కోల్పోయింది.  


దర్యాప్తులో భాగంగా మృతురాలి ఇంటి నుండి పోలీసులు సూసైడ్ నోట్ ను కనుగొన్నారు. లోని ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తన కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టి అవమానించడం గురించి మృతురాలు తన సూసైడ్ నోట్ లో పేర్కొంది.  కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలం తో పాటు సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.


పోలీసుల కథనం ప్రకారం నిందితుడు ఎప్పుడూ ఆమె వెనుక ఫాలో అవుతూ వేధించేవాడు. ఆగస్టు 9వ తేదీన నిందితుడు ఆమె వెంటపడి ఇంటికి వచ్చాడు. ఈ విషయం కాస్తా ఊరి ప్రజలకు తెలియడంతో ఆ రోజు గొడవ జరిగింది. ఈ గొడవలో నిందితుడు విద్యార్థిని తల్లిదండ్రులు పై చేయి చేసుకున్నాడు. దీంతో బీఈడీ కుటుంబ సభ్యులకు ఊరి ప్రజలు అందరు ముందు తలవంపులుగా భావించారు. ముఖ్యంగా చనిపోయిన బీఈడీ విద్యార్థిని బాగా మానసికంగా కృంగిపోయింది. 12వ తేదీన మళ్లీ ఆ నిందితుడు ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె తన ఇంటికి వచ్చి అక్టోబర్ 12 న తన గదిలో ఉరి వేసుకుంది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను స్వామి దయానంద్ ఆసుపత్రిలో చేర్పించారు కానీ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా అక్కడే చికిత్స పొందిన ఆమె సోమవారం మరణించింది.


సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు మృతురాలి గదిని పరిశీలించినప్పుడు డైరీలో సూసైడ్ నోట్ దొరికింది. ఈ నోట్ లో నిందితుడు తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని ఆమె కోరింది అలాగే నిందితుడికి కఠిన శిక్ష విధించాలని పోలీసులను వేడుకున్నట్టు సమాచారం.  ఈ కేసుపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ వేద్ ప్రకాష్ సూర్య మాట్లాడుతూ నిందితుడని త్వరలోనే పట్టుకుంటామని మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: