అమరావతి: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించేందుకు సుప్రీంకోర్టు కార్యాచరణ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీం కోరింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని హైకోర్టులు ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను అందించాయి. ఈ వివరాలను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4,859 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అత్యధిక కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో, రెండో స్థానంలో బీహార్ ఉన్నాయి. ఏపీలో 132, తెలంగాణలో 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే 10 కేసులు సెషన్స్ కోర్టుల్లో, 122 కేసులు మేజిస్ట్రేట్ స్థాయి కోర్టుల్లో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో 118 కేసులు, సీబీఐ, ఇతర కోర్టుల్లో 25 కేసులు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే.. త్వరలోనే చంద్రబాబుకు సంబంధించిన కేసులు కూడా విచారణకు రానున్నట్టు తెలుస్తోంది. ఒకపక్క చంద్రబాబు కేసులు ముందుకు కదులుతోంటే.. సీఎం జగన్‌ కేసులు మాత్రం వాయిదాలు పడుతూ పోవడం విశేషం.

సీఎం జగన్ ఆస్తుల వ్యవహారంపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. పండుగల నేపథ్యంలో న్యాయస్థానాలకు సెలవులు రావడంతో జగన్ ఆస్తులపై విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వీఆర్ మధుసూదన్ రావు సెలవులో ఉన్నారు. దానికితోడు దసరా సెలవులు రావడంతో విచారణను వాయిదా వేస్తునట్టు నాంపల్లి సీబీఐ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి వెల్లడించారు. అటు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి పరిధిలో ఉన్న ఈడీ కేసుపై విచారణ నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, సీఎం జగన్ కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈడీ కేసును కూడా బదలాయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ పిటిషన్ పై విచారణ నవంబరు 5కి వాయిదా పడింది. సీబీఐ కోర్టులో వైఎ్‌స.జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మొదట ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదనరావు సెలవులో ఉన్నందున ఇన్‌చార్జి న్యాయమూర్తి కేసును రెండు రోజులు వాయిదా వేశారు. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది.

దీంతో ఈ నెల మొదట్లోనే జరగాల్సిన విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ ఈ కేసు వాయిదా పడింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులు, ఏసీబీ, ఈడీ, సీబీఐ కేసులపై రోజు విచారణ చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా  పలువురు న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ను కలిసి గ్రేటర్‌ హైదరాబాద్‌లో  కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలని కోరారు. అయితే, యువకులు భౌతికంగా కోర్టులకు హాజరు కావచ్చని, మిగిలిన వారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు కావచ్చని న్యాయమూర్తి చెప్పినట్లు సమాచారం. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన ఐదు కేసుల విచారణ సీబీఐ కోర్టులో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: