ఎర్ర బస్సు అంటే పేదోడి వాహనం. ఎయిర్ బస్సుల్లో పెద్దోళ్ళు ఎన్నెన్నో విహారాలు చేయవచ్చు గాక కానీ ఎర్ర బస్సు లేకపోతే సామాన్యుడి కాళ్ళు అసలు  కదలవు. అలాంటి ఎర్ర బస్సు కన్నెర్ర చేసింది. దాంతో ఈసారి దసరా సరదా కాదు కదా అతి పెద్ద  నరకమే చూపించింది అంటున్నారు. దసరా అంటే తెలంగాణా నుంచి ఆంధ్ర వైపునకు పెద్ద ఎత్తున బస్సుల జాతరే సాగుతుంది.  హైదరాబాద్ లో ఉండే మూడొంతున జనాభాను బస్సులు మోసుకొస్తాయి. ఇక రైళ్ళు కూడా సరిగ్గా లేని ఈ సమయంలో బస్సుల మీద పూర్తిగా జనం ఆధారపడిపోయారు. అయితే లాక్ డౌన్ కి ముందు ఉన్న సామరస్యం తెలంగాణా, ఏపీ ప్రభుత్వాల మధ్యఆ తరువాత  లేకపోవడంతో ఎర్ర బస్సు అలిగింది.

తెలంగాణాలో ఆంధ్రా బస్సులు తిప్పేందుకు కచ్చితమైన నిబంధనలను కేసీయార్ సర్కార్ విధించింది. దాంతో ఏపీ అధికారులు ఎన్ని సార్లు చర్చలు జరిపినా కూడా అవి విఫలం అయ్యాయి. దాంతో పండుగ వేళ బస్సులు సరిగ్గా లేక జనాలు నానా ఇక్కట్లు పడ్డారు. చివరి నిముషంలో మేలుకున్న వైసీపీ సర్కార్ ఆంధ్రా సరిహద్దుల వరకూ బస్సులు నడిపింది. దాంతో అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ దిగి తెలంగాణా బస్సులు ఎక్కి ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు  చేరుకోవాల్సివచ్చింది. ఇది నిజంగా పండుగ సరాదాను తీర్చేసింది అంటున్నారు.

తెలంగాణా ప్రభుత్వం, ఆంధ్రా ప్రభుత్వం తమ మంకు పట్టు వీడకపోవడంతో సగటు ప్రయాణీకలకు ఈ గతి పట్టింది అంటున్నారు.  ఇక్కడో విషయం చెప్పుకోవాలి. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని హక్కులు ఉన్నాయి. అలాంటపుడు హద్దులు, యుద్ధాలు అన్నవి కూడా అసలు వర్తించవు. కానీ చంద్రబాబు సర్కార్ ఆ ఆర్టీసీ విషయాలు, వివాదాలు ఏవీ తేల్చకుండా ఏపీకి 2015లో షిఫ్ట్ అయిపోయింది. ఇపుడు జగన్ సైతం మొదట్లో మెతక‌గా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారాన్ని తేల్చితే  సగటు ప్రయాణీకులు, ప్రజలు ఆనందిస్తారు. ఏపీ అన్ని విధాలుగా నష్టపోకుండా ఉంటుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: