భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక రక్షణ బప్పందం బెకాపై ఇరుదేశాల నేతలు సంతకాలు చేశారు. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది.

భారత్, అమెరికాల మధ్య  టూ ప్లస్‌ టూ మంత్రిత్వ స్థాయి చర్చలు జరిగాయి‌. ఈ చర్చల్లో భారత్‌ నుంచి రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు రాజనాథ్‌ సింగ్‌, జయశంకర్‌ పాల్గొన్నారు. అమెరికా నుంచి మార్క్‌ ఎస్పర్‌, మైక్‌ పాంపియో ప్రాతినిధ్యం వహించారు. ఈ కీలక భేటిలో బేసిక్‌ ఎక్స్చేంజ్‌ అండ్ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు.

బెకా ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలు తెరిచిందని వ్యాఖ్యానించారు. ఇతర సమస్యలపైనా అమెరికాతో చర్చించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ అన్నారు.

రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం బెకా ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో తెలిపారు. లడక్ వివాదాన్ని ప్రస్తావిస్తూ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తామని అన్నారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు స్పేస్‌ సంబంధిత అంశాల్లో పరస్పరం సాయం చేసుకునేందుకు బెకా ఒప్పందం వీలు కల్పిస్తోంది.ఈ ఒప్పందం ప్రకారం రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఉపగ్రహాలు, సెన్సర్లు సేకరించే సమాచారాన్ని, భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకునే అవకాశముంటుంది. మొత్తానికి భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త చరిత్రకు అడుగు పడింది. రక్షణ ఒప్పందంపై ఇరు దేశాల నేతల సంతకాలతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది.







మరింత సమాచారం తెలుసుకోండి: