అసలే ఆరేడు నెలల నుంచి దేశాన్ని కరోనా పట్టిపీడిస్తుందని చెప్పుకుంటున్నాం. అనేక రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని చెప్పుకుంటున్నాం. కానీ.. తాజాగా దసరా పండుగ సీజన్‌లో జనం ఆన్ లైన్‌లో చేసిన కొనుగోళ్ల వివరాలు చూస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో ఈ- కామర్స్‌ సంస్థల అమ్మకాలు ఏకంగా 55 శాతం పెరిగాయట. ఈ సీజన్‌ మొదటి వారం అయిన అక్టోబర్‌ 15 నుంచి 21 వరకు అన్ని ఇ- కామర్స్ సంస్థలు కలిపి ఏకంగా 30 వేల కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిపాయట.

ఇ- కామర్స్ రంగంపై పరిశోధనలు నిర్వహించే రెడ్ సీర్ సంస్థ తాజాగా చేసిన అధ్యయనంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ మొత్తం అమ్మకాల్లో సగం వరకూ  స్మార్ట్‌ ఫోన్‌లే ఉన్నాయట. కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా బాగా తగ్గడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఒక దశలో ఏకంగా నిమిషానికి కోటి 50లక్షల రూపాయల విలువైన స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు జరిగాయట.

ఇక ఇ- కామర్స్ సంస్థల పనితీరు గురించి కూడా ఈ రెడ్ సీర్ సంస్థ అధ్యయనం జరిపింది. అందులో ఫ్లిప్ కార్ట్ సంస్థ మంచి మార్కులు దక్కించుకుంది. ఈ సీజన్‌లో దాదాపు 70 శాతం అమ్మకాలు ఒక్క ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ద్వారానే జరిగాయట. మిగిలిన మార్కెట్‌లో అమెజాన్ ఎక్కువగా హస్తగతం చేసుకుందట. మొత్తం మీద నూటికి 90 శాతం మార్కెట్‌ను  ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ సంస్థలే హస్తగతం చేసుకున్నాయట. మొత్తం జరిగిన ఇ-కామర్స్ అమ్మకాల్లో 90 శాతం విక్రయాలు ఈ రెండు సంస్థలవేనట.

ఇక గతేడాదితో  పోల్చి చూస్తే.. నిరుడు 2కోట్ల 80 లక్షల మంది ఇ కామర్స్‌ సంస్థల ద్వారా షాపింగ్‌ చేశారట. కానీ ఈసారి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది 5 కోట్ల 20 లక్షల మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారట. మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. ఈ అమ్మకాల్లో ఎక్కువగా  ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచే జరిగాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: