జగన్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇపుడు మరిన్ని కొత్త విమర్శలకు కారణం అవుతున్నారు. జగన్ తీసుకున్న ఆ నిర్ణయంతో అసలే మండిపోతున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని మరింత పెంచి పెద్దది చేస్తోంది. ఇంతకీ జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అంటే ఆయన ఒక జాతీయ మీడియాకు దాదాపుగా  8 కోట్ల మేర నిధులను ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం. ఆ జాతీయ మీడియా ఏపీ సర్కార్ గురించి పాజిటివ్ కధనాలు ప్రసారం చేస్తుందట.

ఇంతకీ ఆ జాతీయ మీడియా టైమ్స్ నెట్ వర్క్ అని చెబుతున్నారు. టైమ్స్  నెట్ వర్క్ కి జగన్ సర్కార్ ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ తాజాగా జారీ చేసిన జీవో ఇపుడు ఏపీలో టీడీపీ అనుకూల మీడియాకు ఆయుధం అయింది. అంతే కాదు మిగిలిన తెలుగు మీడియా పెద్దలు కూడా గుర్రుమంటున్నారు. నిజానికి ఏపీలో చంద్రబాబుకు బలమైన మీడియా అండ ఉంది. కానీ న్యూట్రల్ గా ఉండే మీడియా కూడా ఏపీలో ఉంది. వారిపుడు జగన్ ప్రభుత్వ విజయాలను బాగానే ప్రసారం చేస్తూనే ఉన్నారు.

వైసీపీకి కనుక టీడీపీ అనుకూల మీడియా అంటే ఇష్టం లేకపోతే వారిని పక్కన పెట్టి మిగిలిన తెలుగు మీడియా పెద్దలను అయినా చేరదీయవచ్చు కదా అన్నది ఒక చర్చగా ఉంది. జగన్ మాత్రం జాతీయ మీడియాకే పెద్ద పీట వేయడం, అందుకు గానూ కోట్ల రూపాయలు ఇవ్వాలనుకోవడంతో అంతా ఇపుడు ఒక్కటై రగులుతున్నారు. నిజానికి జగన్ కి కావాల్సింది ఆంధ్రాలో ప్రచారం. ఇక్కడ జనాలే జగన్ పాలనపైన తీర్పు చెప్పేది. రేపటి రోజుల రాజకీయం మార్చేది.

అలాంటిది జాతీయ స్థాయిలో అనుకూల కధనాలు వచ్చినా వైసీపీకి ఒరిగేది ఏముంటుంది అన్నది కూడా మరో ప్రశ్న. అంతే కాదు, ఏపీలో తెలుగు మీడియాకు కావాలని జగన్ దూరం కూడా అవుతున్నారని నిందలు మోయాల్సివస్తోంది. ఇదిలా ఉంటే మీడియా అవసరం ఏ ప్రభుత్వానికైనా పెద్దగా ఇప్పటి రోజుల్లో పెద్దగా లేదన్నది మరో వాదన. చంద్రబాబుని అనుకూల మీడియా ఎంతగా పొగిడినా గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాబట్టి ఇస్తే గిస్తే రూపాయి అయినా తెలుగు మీడియాకు ఇస్తే మేలు కానీ జాతీయ మీడియా మీద మోజు పెంచుకోవడం మంచిది కాదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: