దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్‌వేవ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఉత్త‌ర భార‌తంలో ఇప్ప‌టికే క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. పెరిగిన చ‌లితో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా పెరుగుతోంది. ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ పాటు మ‌హ‌రాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో కూడా  కేసులు గ‌ణ‌నీయంగా న‌మోద‌వుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా అదుపులోనే ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కేసులు పెద్ద‌గా న‌మోదుకావ‌డం లేదు. ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 1000కి మించ‌కుండా కేసుల న‌మోదు ఉంది.దీనికి తోడు 94శాతం రిక‌వ‌రీ ఉండ‌టంతో కాస్త నిశ్చింతంగానే ఉంద‌ని చెప్పాలి. అయితే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది.


ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం క‌రోనా రిక‌వ‌రీ రేటులో మిగ‌తా అన్ని రాష్ట్రాల క‌న్నా ఎంతో మెరుగ్గా ఉంద‌నే చెప్పాలి. దీంతో మ‌రింత మెరుగైన ఫ‌లితాల‌ను రాబ‌ట్టేందుకు, బాధితుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిం చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రు ల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందు బాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలుండగా, వాటిల్లో 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యముంది.  మిగిలిన 11 వేల పడకలకు కూడా ఆక్సిజన్‌ను అందు బాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 


 ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూడా క‌రోనా అదుపులోనే ఉంది. సోమ‌వారం వెల్ల‌డైన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..  ఆదివారం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,948కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,390 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పు గోదావరిలో 104, గుంటూరులో 117,  కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో25, శ్రీకాకుళంలో 19, విశాఖలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: