ఆరేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ రాజకీయాల్లో బాగానే రాటుదేలారు అని చెప్పాలి. పవన్  కి ఇపుడు ఎక్కడ తగ్గాలో కాదు, ఎలా నెగ్గాలో కూడా బాగా తెలిసింది. ఆయన అందుకే తనదైన పాలిటిక్స్ చేస్తూ ముందుకు పోతున్నారు. బీజేపీ పెద్దన్న రాజకీయానికి అలా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలలో పోటీ అంటూ అక్కడ స్విచ్ వేసిన పవన్ తిరుపతిలో లైట్ వెలగాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ ని కేవలం ప్రచార సాధనంగా బీజేపీ వాడుకోవాలని చూస్తోందని అర్ధమైన తరువాతనే ఈ రకంగా ఆయన స్టాండ్ తీసుకున్నారని అంటున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో ఎటూ బీజేపీకి మద్దతుగా తాము బరి నుంచి తప్పుకున్నాం కాబట్టి తిరుపతి ఎంపీ సీట్లో తమ పార్టీకి చాన్స్ ఇవ్వాలని పవన్ కోరుతున్నాట్లుగా చెబుతున్నారు. నిజంగా ఆలోచిస్తే ఇది సబబు అయిన ప్రతిపాదనే.

పొత్తు అంటే రెండు పార్టీలకూ సమాన అవకాశాలు ఉండాలిగా. పైగా జనసైనికులు చెబుతున్న లాజిక్ కూడా అర్ధం చేసుకోవాల్సిందే. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గా ప్రసాద్ 2.28 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక టీడీపీ తరఫున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి నాలుగు లక్షల దాకా ఓట్లు వచ్చాయి. అదే విధంగా మూడవ స్థానంలో నోటా ఉంది. 30 వేల పై చిలుకు ఓట్లు నోటాకే పడ్డాయి. నాలుగవ స్థానంలో జనసేనతో  పొత్తు పెట్టుకున్న బహుజన సమాజ్ వాది పార్టీ పార్టీ అభ్యర్ధి పోటీ చేస్తే 18 వేల ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అయిదవ స్థానంలో బీజేపీ నిలిచింది. ఆ పార్టీ అభ్యర్ధికి 16 వేల ఓట్లు వచ్చాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా తాము మద్దతు ఇచ్చిన అభ్యర్ధి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ సీటు తమకు ఇవ్వాలని పట్టుపడుతోంది.

దీని మీదనే చర్చించేందుకు పవన్ అకస్మాత్తుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. బీజేపీ అగ్రనాయకులతో పవన్ చర్చిస్తారు అని అంటున్నారు. మరి పవన్ కి అనుకూలంగా బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి. అంతేకాదు, బీజేపీ ఇక్కడ తప్పకుండా పోటీ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశాన్ని పార్టీ పెద్దలు నిర్వహించారు. మరి పవన్ పట్టు పడితే బీజేపీ పెద్దలు ఎలా నచ్చచెబుతారో చూడాలి. మొత్తానికి కాషాయానికి కషాయం తాగించేలా పవన్ రాజకీయం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: