ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పట్టణాలు, నగరాల్లో భారీగా ఆస్తిపన్ను పెంచబోతోంది. కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్ను విధానానికి బదులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు నిర్ణయించిన ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో పట్టణాలు, నగరాల్లో భారీగా ఆస్తి పన్ను పెరుగుతుందని సమాచారం. అదే జరిగితే.. సగటు నగరవాసి పన్నుపోటు తప్పదు.

రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను భారీగా పెరగగబోతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల సదుపాయాల యూజర్‌ ఛార్జీలను పెంచిన రెండోరోజే ఆస్తి పన్ను భారం మోపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ చట్టాల్లో సవరణలు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్సుకు గవర్నరు ఆమోద ముద్ర వేయడంతో ఈ లాంఛనం పూర్తయింది.

వచ్చే ఏప్రిల్‌ నుంచే కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందని, దానికి సిద్ధం కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒక నగరం లేదా పట్టణాన్ని కొన్ని జోన్లుగా విభజించేవారు. ఆ జోన్‌లోని నివాస, వాణిజ్య భవనాలకు ఎంత అద్దెలు వస్తాయో అంచనా వేసి... చదరపు మీటరుకు ఇంత మొత్తమని నిర్ణయించి గెజిట్‌ లో నోటిఫై చేసేవారు. భవనం పొడవు, వెడల్పు ఆధారంగా దాని విస్తీర్ణాన్ని నిర్ణయించేవారు. దాన్ని బట్టి అద్దెను లెక్కవేసి.. కూడికలు, తీసివేతలు పోగా ఆస్తి పన్ను నిర్ణయించేవారు.

పట్టణ స్థానిక సంస్థల్లో ఐదేళ్లకు ఒకసారి పన్నులు సవరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో పలు సంవత్సరాలుగా ఆ ప్రక్రియ జరగలేదు. చివరిగా 2002లో నివాస భవనాలకు, 2007లో వాణిజ్య భవనాలకు పన్నులు సవరించారు.  ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించడం వల్ల పన్ను అనేక రెట్లు పెరగుతుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

పన్ను మినహాయింపులు
ప్రభుత్వం గుర్తించిన చౌల్ట్రీలు, సేవా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, లైబ్రరీ, మైదానాలు లాంటి ప్రజోపయోగ స్థలాలు, పురాతత్వ ప్రదేశాలు, ఛారిటబుల్‌ ఆసుపత్రులు, రైల్వే ఆసుపత్రులు, శ్మశానాలు మొదలైన స్థలాలకు ఆస్తిపన్ను, ఖాళీ స్థలం పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ​సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు నివసించే ఒక ఇంటికి లేదా ఖాళీ స్థలం పన్ను మినహాయింపు కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: