గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ప్రచారంలో చివరి అంకంలో అన్ని పార్టీలూ బడా బడా నేతలను రంగంలోకి దించుతున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఇతర పార్టీలపై నిప్పులు చెరిగారు. ఈ సభంలోనే కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ తెెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆమె విరుచుకు పడ్డారు. బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత  అన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కవిత ప్రసగించారు.

టీఆర్‌ఎస్‌ను పడగొట్టాలని చాలా మంది చూశారని, వారు అలా చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ జనమే కేసీఆర్‌ను నిలబెట్టారని చెప్పారు.  ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బల్దియా ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మరని, వారు చేసే మోసాలు ప్రజలందరికీ సుపరిచితమే అని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురు లేదని, కచ్చితంగా 100 సీట్లు గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బీజేపీ తరఫున మహామహులు భాగ్యనగరానికి వచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఇప్పటికే నగరంలో ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. యూపీ సీఎం యోగి కూడా హైదరాబాద్ రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: