తెలంగాణ వ్యాప్తంగా పులులు, చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. కొమురం భీం జిల్లాలో ఒక పులి దారి తప్పి గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా ఆ పులి కోసం ప్రత్యేక బృందాలు గత మూడు రోజుల నుంచి గాలిస్తున్నాయి. తాజాగా ఈ పులి బెజ్జూర్ వద్ద రోడ్డు దాటుతుండగా కనిపించినట్లు తెలుస్తోంది. అయితే మరో పక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ బావిలో చిరుత పడిన ఘటన కలకలం రేపుతోంది. చుట్టూ అటవీప్రాంతం ఉండగా ఆహారం కోసం బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి వచ్చిన చిరుత చీకట్లో అనుకోకుండా వ్యవసాయ బావిలో పడి పోయింది. 

అయితే అది రాత్రంతా అలానే ఉండి పోయింది. ఈ విషయాన్ని చూసిన గ్రామస్తులు కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నిన్న మధ్యాహ్నం సమయానికి ఆ పులిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ ఆ చర్యలు ఏవి సఫలం కాలేదు. నిన్న రాత్రి పొద్దు పోవడంతో ఆ చిరుతను తీసేందుకు వేసిన నిచ్చెనలు అలానే ఉంచి హైదరాబాద్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం బావికి కొంచెం దూరానికి వచ్చి ఎదురు చూస్తూ ఉండిపోయారు. 

అయితే ఉదయం వెళ్లి చూసేటప్పటికి బావిలో చిరుత కనిపించలేదు. ఆ బావిలో ఒక రహస్య సొరంగం కూడా ఉండడంతో చిరుత దాని ద్వారా బయటకు వచ్చిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో పక్క చిరుత కోసం బావిలోకి నిచ్చెనలు వేసి ఉండడంతో బహుశా నిచ్చెనల మీద నుంచి బయటకు వచ్చినా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బావిలోకి దిగి చూసిన అటవీశాఖ అధికారులు చిరు తప్పించుకున్నట్లు ప్రకటించారు. దీంతో మల్కాపూర్ గ్రామం సహా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: