ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర జిల్లా శ్రీకాకుళానికి చెందిన సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు క‌ళా వెంక‌ట్రావు.. బీజేపీలోకి జంప్ చేస్తున్నార‌న్న వార్త‌.. కొన్ని గంట‌ల పాటు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేసింది. అంతేకాదు.. ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు .. క‌ళా వెంక‌ట్రావు ఇంటికి వెళ్లి మ‌రీ .. పార్టీలో చేర్చుకుంటున్నార‌నే ప్ర‌చారం భోగి మంట మాదిరిగా ఎగిసి ప‌డింది. ఇది తీవ్ర సంచ‌ల‌నానికి దారితీసింది. వెంట‌నే `నిజ‌మా ?!` అని నోరెళ్ల‌బెట్టి.. స‌మీప నేత‌ల‌కు ఫోన్లు కొట్టి.. మ‌రీ దీనిపై చ‌ర్చించారు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు. వైసీపీలోనూ చ‌ర్చ సాగింది.

`ఇది నిజ‌మేనా ?  ఇలా ఎందుకు జ‌రుగుతోంది. అంత సీనియ‌ర్ నేత‌, ప‌ద‌వులు కూడా అనుభ‌వించిన నాయ‌కుడు పార్టీమారితే.. బ్యాడ్ సంకేతాలు రావా ?!` అని గంట‌ల కొద్దీ టీడీపీ సీనియ‌ర్లు చ‌ర్చించారు. క‌ట్ చేస్తే.. ఈ సంచ‌ల‌న‌ ప్ర‌చారంపై క‌ళా కొన్ని గంట‌ల త‌ర్వాత ఆచితూచి చాలా నింపాదిగా స్పందించారు. దీనికి సంబంధించి చూచాయ‌గా.. ఓ ప్ర‌క‌ట‌న చేసి వ‌దిలేశారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను క‌ళా వెంక‌ట్రావు ఖండించారు. పార్టీ మార్పు వార్తల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఇంటికి వస్తున్న విషయం కూడా తెలియదని స్పష్టం చేశారు. చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని ప్రకటించారు.

దీంతో `హ‌మ్మ‌య్య‌!` అని టీడీపీ నేత‌లు ఫోన్లు క‌ట్ చేసి, చ‌ర్చ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక‌, ఇప్పుడు విశ్లేష‌కుల వంతు వ‌చ్చింది. అస‌లు ఏం జ‌రిగింది?  ఎందుకు ఈ విష‌యం ఇంత సీరియ‌స్ అయింది? అనే చ‌ర్చ చేశారు. ఒకింత లోతుగా చూస్తే.. రాష్ట్ర పార్టీ చీఫ్ బాధ్య‌త‌ల నుంచి త‌న‌ను త‌ప్పించి అచ్చెన్న‌కు ఇవ్వ‌డం క‌ళాకు ఒకింత అవ‌మానంగా ఉంద‌నే విష‌యం అప్ప‌ట్లోనే తెర‌మీదికి వ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా.. అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి క‌ళా డుమ్మా కొట్టారు. ఇక‌, పార్టీలోనూ త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని.. గ‌తంలో ఏదైనా జ‌రిగితే.. త‌న‌కు స‌మాచారం ఉండేద‌ని.. కానీ.. ఇప్పుడు ఎవ‌రూ చెప్ప‌డం లేద‌ని కూడా క‌ళా వెంక‌ట్రావు ఆవేద‌నతో ఉన్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక‌, పార్టీ మార‌డం అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. క‌ళా వెంక‌ట్రావుకు పార్టీలు మార‌డం అనేది కొత్త‌కాదు.. గ‌తంలో ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. అక్క‌డ స‌క్సెస్‌కాలేక పోయారు. మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ పార్టీ అధ్య‌క్ష పీఠాన్ని ద‌క్కించుకున్నారు. త‌ర్వాత మంత్రి ప‌ద‌వినీ సొంతం చేసుకున్నారు. అయితే.. ఈయ‌న సార‌థ్యంలోనే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ విష‌యం అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో త‌ర‌చుగా వ‌చ్చేది. కానీ, చంద్ర‌బాబు పార్టీ ఓడిపోయిన త‌ర్వాత కూడా ఏడాది పాటు కొన‌సాగించారు. పార్టీ ఒక‌వైపు మైన‌స్‌ల‌లోకి వెళ్లిపోతున్నా.. దూకుడుగా.. క‌ళా చేసింది ఏమీ లేదు. ప్ర‌భుత్వంపై నోరు విప్పి.. మాట్లాడింది కూడా లేదు. ఎంత సేపూ.. ప్రెస్ నోట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్థానంలో దూకుడుగా ఉన్న అచ్చెన్న‌ను బాబు రంగంలోకి దింపారు. ఇక‌, ఇప్పుడు ఇవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకునే క‌ళా వెంక‌ట్రావు.. ఇలా వ్యూహాత్మ‌క అడుగు వేశారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లేదా ఇది నిజ‌మైనా అయి ఉండాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. బీజేపీలో చేరిక విష‌యాన్ని క‌ళా వెంక‌ట్రావు ఖండించారు.. బాగానే ఉంది. కానీ, త‌న‌పై వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించి సోము వీర్రాజు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. పోనీ.. ఆయ‌న అనుచ‌ర నేత‌లు కూడా రియాక్ట్ కాలేదు. అంటే.. తెర‌వెనుక ఏదో జ‌రిగి ఉండాలి!! మొత్తానికి త‌న ఉనికిని చాటుకునేందుకు క‌ళా చేసిన ప్ర‌య‌త్నంలో భాగ‌మనే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిపై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: