ఈరోజు భారత దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. ఈరోజు దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సినేషన్  పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు సుమారు మూడు లక్షల మంది వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందనుంది. ఇక ఈ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం అని మోడీ పేర్కొన్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం చాలా ఎదురు చూసిందని వ్యాక్సిన్ రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించారు అని మోడీ పేర్కొన్నారు.

 మన శాస్త్రవేత్తల కృషి వల్ల రెండు స్వదేశీ వ్యాక్సిన్ లు ఆవిర్భవించాయని మరికొన్ని భారతీయ వ్యాక్సిన్ లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ మీద ఎలాంటి అపోహలు పెట్టు కోవద్దని మోడీ కోరారు. ఈ తొలి డోసు తీసుకునేందుకు వైద్య సిబ్బంది మాత్రమే అర్హులు అని మోడీ పేర్కొన్నారు. వారి తర్వాత పారిశుధ్య, పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ అందుతుందని ఆయన అన్నారు. 

వీరందరి తర్వాత 50 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సినేషన్ వేస్తామని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మోడీ తెలుగు కవితను చదివి వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహాకవి గురజాడ అప్పారావు మాటలను ప్రధానమంత్రి మోడీ ఈరోజు గుర్తు చేశారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే కవితను ఆయన తెలుగులో చదివి వినిపించారు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయి అంటూ మోడీ పూర్తి కవితను చదివి వినిపించారు. గురజాడ చెప్పినట్లు పరుల కోసం మనమంతా సాయపడాలని మోడీ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: