ఒకప్పుడు బూతు సీన్లు చూడాలంటే.. కొన్ని సినిమాల్లోనే ఉండేవి.. అందుకే సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టేవారు.. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు, ఓటీటీల పుణ్యమా అని ఇప్పుడు అరచేతిలోనే అశ్లీలం పొంగిపొర్లుతోంది. సినిమాకి అంటే సెన్సార్ ఉంటుంది. కత్తెర్లు ఉంటాయి. కానీ.. ఓటీటీకి అలాంటివేమీ ఉండవు. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బూతు సీన్లకు అడ్డులేకుండా పోతోంది. అయితే ఈ బూతు జోరుపై ఇప్పుడు అభ్యంతరాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

అందుకే ఇప్పుడు కేంద్రం ఓటీటీలకు కూడా అడ్డుకట్ట వేయాలనుకుంటోంది. అందుకే.. మీరే కత్తెర వేసుకుంటారా.. లేకపోతే.. మమ్మల్ని కత్తెర వేస్తారా అని ఓటీటీలను అడుగుతోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటిఓటిటి సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వీయ నియంత్రణ ద్వారా ఓటిటిలో ప్రదర్శించే చిత్రం లేదా వెబ్ సిరీస్‌ను పర్యవేక్షించుకోవాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండదని స్పష్టం చేసిన కేంద్రం అంటోంది.

తాజాగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌ లో కొత్తగా వచ్చిన  చిత్రం 'తాండవ్‌' దేశంలో కలకలం రేపుతోంది. 'తాండవ్' చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, మాటల పట్ల.. చాలా సంస్థలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయని కేంద్రం చెబుతోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలని చాలా సంస్థలు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు కేంద్రం తెలిపింది. గత కొన్ని రోజులుగా, హైకోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు ఓటిటి ప్లాట్‌ఫాంలలో వస్తున్న ఫిల్మ్, వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులు విచారణకు వస్తున్నాయని కేంద్రం తెలిపింది.

ఓటిటి ప్లాట్‌ఫాంపై అశ్లీల చిత్రాలను అరికట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సూచించిందని కేంద్రం చెబుతోంది. గత సంవత్సరం, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓటిటి సంస్థలతో మూడు సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికి ఎటువంటి స్పష్టత రాలేదని కేంద్రం చెబుతోంది. సెన్సార్ బోర్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వార్తాపత్రికలు, టీవీ న్యూస్ ఛానల్స్ వంటి సంస్థలు రూపొందించుకున్నట్లుగా ఓటిటి సంస్థలు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని కేంద్రం సూచిస్తోంది. అంతే కాదు.. స్వీయ నియంత్రణ పాటించకపోతే.. తామే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం వార్నింగ్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: