నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద 2, 3 సంవత్సరాల్లో జిల్లాలో 1,045 కొత్త ఊర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండలం పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతపూరం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతరలా, పండుగలా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. నిరుపేదలు గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోయేలా ఇంటి నిర్మాణాలు చేపడతామన్నారు. నిరుపేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇస్తున్నామని, అదనంగా రూ.60  వేలతో రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంకులు, ఆసుపత్రులు, గుడి,  బడి, నీటి సౌకర్యం తదితర అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
                                        జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణం కోసం వాలంటీర్ ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం కల్పించిన మూడు అంశాలలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని ఇల్లు కట్టుకోవచ్చని మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ముడిసరకు కావాలంటే ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, లేదా మేము పెట్టుకోలేము ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని అడిగినా.. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలు అందజేస్తున్నామని తెలియజేశారు.
                                                    ఇంటి పట్టాల తో పాటు 1.11 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి సంబంధించి మంజూరు ఇచ్చామని, మిగతా ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మంజూరు చేస్తామని మంత్రి సత్యన్నారాయణ చెప్పారు. ప్రజలంతా ఒకే కులం, మతం, వర్గం అని, అందరూ కలిసి ఉండాలని లాటరీ తీసి ఇంటిగ్రేటెడ్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సామాన్యులకు మంచి జరగాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు సరిహద్దులు తెలియజేసి, అధికారుల సంతకం, పూర్తి వివరాలు, డి ఫారం పట్టా ఇస్తున్నామని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: