ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో 85 పేజీల తీర్పునిచ్చి... పలు అంశాలను ప్రస్తావించింది. భూములు కొనుగోలు చేయటం భారత పౌరుడిగా రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు అని హైకోర్ట్ స్పష్టత ఇచ్చింది. భూములమ్మేవారు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు అని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి అని తెలిపింది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ క్రిమినల్ నేరాల కిందకు రావు వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు అని స్పష్టత ఇచ్చింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడితే మోపే నేరం అని తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద జరిగే నేరాలకు ఐపీసీలోని సెక్షన్లను వర్తింపచేయలేమని చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 420తో సహా ఏ సెక్షన్ కింద ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద నేరంగా పరిగణించలేము అని చెప్పింది. భారత శిక్షా స్పృతికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం కొత్తది, అసలు సంబంధంలేనిది అని హైకోర్ట్ తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఈ కేసులోని పిటిషనర్లను ప్రాసిక్యూట్ చేయాలని కోరటం సాధ్యమయ్యే పనికాదు అని తెలిపింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్ ను వర్తింపచేయటం న్యాయపరంగా నిలిచే ప్రక్రియకాదు అని తెలిపింది. ఈ భూమి కొనుగోలు వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నాననేది కొనుగోలుదారులు వెల్లడించాల్సిన అవసరం లేదు అని, ఈ లావాదేవీలతో భూములు అమ్మిన వారికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు అని స్పష్టత ఇచ్చారు. ఈ లావాదేవీల్లో ఎటువంటి నేరపూరితమైన స్వభావం కూడా లేదు అని క్లారిటీ ఇచ్చింది.  ఈ కేసులో ఐపీసీలోని సెక్షన్ 420, 406, 409, 120బి కింద నేరాలను పరిగణనలోకి తీసుకోలేము అని తెలిపింది.

ఈ సెక్షన్ల కింద కేసులు మోపటం న్యాయ సమ్మతంకాదు అని స్పష్టత ఇచ్చింది. అందుకనే ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తున్నట్టు హైకోర్ట్ తీర్పులో పేర్కొంది. రాజధాని ఎక్కడ వస్తుందో ప్రముఖ పత్రికల్లో ముందుగానే ప్రచురితమైంది అని, ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారం తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని వస్తుందని ప్రకటించారు అని, భూములమ్మేవారికి, కొనుగోలు చేసేవారికి రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు అని హైకోర్ట్ తెలిపింది. ప్రపంచంలో అందరికీ తెలిశాక ఇందులో కుట్ర కోణం దాగి ఉందని ఎలా చెబుతాం అని ప్రశ్నించింది. ఇటువంటి కేసులను అనుమతిస్తే భవిష్యత్ లో భూమి అమ్మిన ప్రతిఒక్కరూ ధర పెరిగిన వెంటనే కొనుగోలుదారులపై కేసులు పెడతారని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: