అమరావతి: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికి పక్కా ఇళ్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం జనవరం 30 వరకు పొడిగించింది. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా చెప్పారు. సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాద్‌ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ పాల్గొన్నారు.

వీరితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం గిరిజా శంకర్, సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యాచరణ గురించి కూడా సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుందన్నారు. ఇప్పటికే ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సదుపాయం ఉందని, ఇది కూడా ఇక నుంచి కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇళ్ల పట్టాలపై మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా ఇళ్ల పట్టాల కార్యక్రమం కొనసాగాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో పట్టా ఇవ్వాలని సూచనలు చేశారు. అధికారులు అందరూ ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అనంతరం అధికారులు సీఎం జగన్ మోహన్ రెడ్డితో లబ్ధిదారుడికి పట్టా అందించి ఇంటి స్థలాన్ని చూపిస్తామని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: