చైనా మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఏకంగా ఓ గ్రామమే నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది శాటిలైట్ చిత్రాల ద్వారా రుజువైంది కూడా. దీనిపై ఇండియా మీడియా రచ్చ రచ్చ చేసింది.. అయితే సిగ్గులేని చైనా సర్కారు తాను చేసిన తప్పును కూడా సమర్థించుకుంటోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించడంపై చైనా అడ్డంగా బుకాయిస్తోంది. అది తన భూభాగమని చెబుతోంది. సొంత నేలపై తాను అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం సహజమేనని కామెంట్ చేసింది. అసలు ఇదో సమస్య కాదు.. ఇంకా దానిపై మాటలు అనవసరం అంటోంది.

దక్షిణ టిబెట్‌ కు సంబంధించి మా వైఖరి సుస్పష్టం. సదరు అరుణాచల్‌ ప్రదేశ్‌ను మేం ఎన్నడూ గుర్తించనేలేదంటోంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగ్‌ ఓ ప్రకటన చేశారు. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. భారత్‌లో దాన్ని అంతర్భాగంగా గుర్తించడం లేదు. భారత్‌ మాత్రం ఆ వాదనను గట్టిగా ఖండిస్తోంది.

అసలేం జరిగిందంటే..  చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టింది. ప్లానెట్‌ ల్యాబ్స్‌ గతేడాది నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చైనా దురాక్రమణపై ఎన్డీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సుభాన్‌సిరి జిల్లాలో సారిచూ నది ఒడ్డున ఈ గ్రామం ఉన్నది. ఈ ప్రాంతంపై చైనా, భారత్‌ల మధ్య  1959 నుంచి వివాదం ఉన్నది.

2019 ఆగస్టు 26వ తేదీన తీసిన ఫొటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. నవంబర్‌ 1న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఏకంగా ఓ ఊరు కనిపించింది.. అంటే ఒక్క ఏడాదిలోనే చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఏకంగా ఓ గ్రామం నిర్మించిందన్నమాట. ఇప్పుడు ఈ దురాక్రమణపై మీడియాలో కథనాలు రావడంతో భారత్ ఆచితూచి స్పందించింది. ఉపగ్రహ చిత్రాలు వార్తాచానళ్లలో ప్రసారం కావడంతో వివరణ ఇచ్చింది. సరిహద్దుల్లో ప్రజల జీవన సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత ప్రభుత్వం రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నదని పేర్కొన్నది. దేశ సరిహద్దుల వద్ద అన్ని వేళలా నిఘా ఉంటుందని, దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: