రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిశోర్ బాబుకు ల‌క్కీ ఛాన్స్ ద‌క్కుతుందా ?  తిరుప‌తి పార్ల‌మెంటు ఉప‌ ఎన్నిక‌లో రావెల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఓ వ‌ర్గం కోరుతున్న డిమాండ్ నెర‌వేరుతుందా ? అంటే.. చెప్ప‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రావెల బీజేపీలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన రావెల‌.. తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎస్సీ ల‌కు రిజ‌ర్వ్ అయిన‌.. ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో నేత‌లు, పార్టీలు ఏమీ తేల్చ‌లేదు.

ప్ర‌స్తుతం.. బీజేపీ-జ‌న‌సేన పొత్తులో భాగంగా ఇక్క‌డ ఎవ‌రు పోటీ చేయాలనే విష‌యం ఇంకా ఏమీ తేలలేదు. ఇప్ప‌టికే బీజేపీ మాత్రం మేమే పోటీ చేస్తాం.. మేమే విజ‌యం సాధిస్తాం.. అని ప‌రోక్షంగా తిరుప‌తి నుంచి పోటీ చేస్తున్న సంకేతాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే.. జ‌న‌సేన మాత్రం మేం మీ కోసం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను త్యాగం చేశాం క‌నుక‌.. మాకు ఇది వ‌దిలేయాల‌ని అంటోంది. దీనిపై జ‌న‌సేన తాజాగా నిర్వ‌హించిన మేదోమ‌ధ‌న స‌ద‌స్సులోనూ ఈ మాట‌కే క‌ట్టుబ‌డాల‌ని తీర్మానించిన విష‌యం వెలుగు చూసింది.

ఈ నేప‌థ్యంలో అటు బీజేపీ కూడా మాకే ఈ ఛాన్స్ ద‌క్కాల‌ని కోరుకుంటోంది. ఈ క్ర‌మంలో అటు బీజేపీ.. ఇటు జ‌న‌సేన‌లు.. రెండు ప‌ట్టు విడవ‌క‌కుండా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ విష‌యాన్ని నిశితంగా పరిశీలించిన రావెల‌.. బీజేపీలోని త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో కొత్త ప్ర‌తిపాద‌నను తెర‌మీదికి తెచ్చిన‌ట్టు తెలిసింది. తాను గ‌తంలో జ‌న‌సేన‌లో ప‌నిచేశాను క‌నుక‌.. త‌న‌ప‌ట్ల ప‌వ‌న్ సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంద‌ని.. తాను ఇప్పుడు ఎలాగూ బీజేపీలోనే ఉన్నాను..క‌నుక‌.. ఇబ్బంది లేద‌ని.. సో.. ఈ రెండు పార్టీలూ సంయుక్తంగా త‌న పేరును ప‌రిశీలించాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

ఈ క్ర‌మంలో కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీలో చ‌క్రం తిప్పే.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడికి రావెల లేఖ రాసిన‌ట్టు తెలిసింది. అంటే.. ఇరుప‌క్షాలు ఉమ్మ‌డి అభ్య‌ర్థిని ఎంపిక చేయాల‌ని.. అది కూడా త‌న‌ను ఎంచుకుంటే.. గెలుపు అవ‌కాశాలు త‌న‌కు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రావెల చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ లేఖ‌ను బీజేపీ వ‌ర్గాలు ప‌రిశీలిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో జ‌న‌సేన ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఎలాగూ.. విష‌యంలో క్లారిటీ ఉంది క‌నుక‌.. ఇరు ప‌క్షాలూ క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెడితే.. బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా.. అయితే.. ఆ ఉమ్మ‌డి అభ్య‌ర్థి రావెలే అవుతారో.. లేక మ‌రో నేత అవుతారో చూడాల‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: