తాజాగా విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్రతో ఒక్కసారిగా రాజకీయం మారినట్టు తెలుస్తోంది. జనాల్ని తరలించారో, లేక స్వచ్ఛందంగా వచ్చారో తెలియదు కానీ.. భారీగా జన సమీకరణ జరిగింది. దీంతో టీడీపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ రాసినప్పుడు కూడా ఇంత స్పందన రాలేదు, పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్షకి కూడా ఈ రేంజ్ లో స్పందన రాలేదు. తీరా ఇప్పుడు విజయసాయిరెడ్డి పాదయాత్రకు జనం భారీగా తరలి రావడంతో చంద్రబాబులో అంతర్మథనం మొదలైంది. దీంతో హడావిడిగా కేంద్రానికి లేఖ రాశారు.
చంద్రబాబు రాసిన లేఖలో కొత్త అంశాలేవీ లేకపోవడం విచిత్రం. గతంలో సీఎం జగన్ తన లేఖలో ప్రస్తావించిన అంశాలనే మరోసారి హైలెట్ చేశారు. సొంత గనులు లేకపోవడం, రుణాలపై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం వల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ సొంత గనుల్ని కేటాయిస్తే పరిశ్రమ మళ్లీ లాభాల బాట పడుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా తెలుగు ప్రజలంతా ఏకతాటిపై నిలిచి పోరాడి, 32 మంది బలిదానంతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయవద్దని వ్యక్తిగతంగానూ, రాష్ట్ర ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రైవేటీకరణ కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూడండని కోరారు బాబు.
విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి భూములిచ్చిన వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని కోరారు చంద్రబాబు. 16 వేల కుటుంబాలు ఉక్కు కర్మాగారం కోసం భూములివ్వగా.. ఇప్పటి వరకు కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారని గుర్తు చేశారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం రూ.1,333 కోట్లతో ప్లాంట్ పునర్ వ్యవస్థీకరణ ప్యాకేజీ ప్రకటించిందని, దానివల్ల ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా ప్లాంట్ పై సానుకూలంగా స్పందించాలని సూచించారు చంద్రబాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి