సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నాలుగేళ్ళ క్రితం ప్రారంభించిన వజ్ర మినీ బస్సు సేవలు మూన్నాళ్ల ముచ్చటగా ముగిశాయి. . కరోనా పేరుతో మొన్నటి వరకు డిపోలకే పరిమితం కాగా... ఇప్పుడు వాటిని పూర్తిగా వదిలించుకునేందుకు రంగం సిద్ధం చేసింది టీఎస్‌ఆర్టీసీ. ఈ బస్సుల్ని రోడ్లపై తిప్పేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆక్యుపెన్సీ పెరగడం లేదన్న సాకుతో అటకెక్కించేస్తున్నారు. 21 సీట్ల సామర్ధ్యంతో వజ్ర మినీ ఏసీ బస్సుల్ని 2017 మే 4న కేసీఆర్‌ ప్రారంభించారు. దీంతోపాటు ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ యాప్‌ కూడా ఆవిష్కరించారు. ఒక్కొక్కటి 70 లక్షల లెక్కన 66 బస్సుల్ని కొన్నారు. అయితే డిజైనింగ్‌, రన్నింగ్‌,  సీట్ల బిగింపులో అనేక లోపాలు ఉన్నాయని మొదట్లోనే విమర్శలు వచ్చాయి.

లోపాలపై కార్మిక సంఘాలు కూడా రాత పూర్వకంగా నివేదిక ఇచ్చినా ఎలాంటి మార్పు చేయకుండా కొనుగోలు చేసింది యాజమాన్యం. రాజధాని ఏసీ సెమీ స్లీపర్‌తో సమానంగా టిక్కెట్‌ రేట్లను నిర్ణయించారు. మొదట హైదరాబాద్‌-వరంగల్‌ రూట్లో ప్రవేశపెట్టారు. కొత్తలో బాగానే ఉన్నా తర్వాత జనం పల్చబడ్డారు. సీట్లు సౌకర్యవంతంగా లేకపోవడం... టిక్కెట్‌ రేటు అధికంగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌,  గోదావరిఖని రూట్లలోనూ ఇదే పరిస్థితి కావడంతో ఏడాదికి 12 కోట్ల నష్టాలు వచ్చాయి.

ఆర్టీసీలో ఫెయిల్‌ అయిన ఈ బస్సుల్ని సెట్విన్‌ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గతంలో వార్తలు వచ్చాయి.   అధికారపార్టీ నేతలు బినామీగా ఈ బస్సుల్ని దక్కించుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలుకూడా వచ్చాయి. హైదరాబాద్‌ సిటీలో తిప్పాలని భావించినా గిట్టుబాటు కాదని వజ్జ బస్సుల్ని మూలకు నెట్టేశారు. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో నష్టాలు వస్తున్నాయని వెయ్యి బస్సుల్ని తగ్గించారు. మెట్రోరైల్‌కు నష్టం కలుగకుండా, మెట్రో స్టేషన్ల నుంచి బస్తీల్లోకి షేర్‌ ఆటో తరహాలో ఈ బస్సుల్ని తిప్పాలని అనుకున్నారు. అదికూడా బెడిసికొట్టింది. ప్రయివేట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు లీజుకు ఇవ్వాలనుకున్నా కుదరలేదు. దీంతో ఇక వదిలించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: