తెలంగాణ రాష్ట్రంలో పాలన పరంగా ప్రజల నుండి మిశ్రమ స్పంద వస్తున్నప్పటికీ దేశ రాజకీయాల పరంగా ఈ రాష్ట్రానికి మంచి పేరే ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు అమోఘం అని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గడిచిన సంవత్సరం దేశమంతా కరోనా ప్రభావముతో అభివృద్ధి నత్త నడకన సాగింది. అంతే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో తెలంగాణ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీసుకున్న చొరవ ఎనలేనిది.

అప్పట్లో వివిధ రాజకీయ కారణాల వలన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండడం వలన స్వయంగా కేటీఆర్ సీఎం లాగా వ్యవహరించి అప్పటి పరిస్థితులను చాకచక్యంగా చక్కదిద్దారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం కాలంలో ప్రజలను చైతన్య పరిచిన తీరును మెచ్చుకోక తప్పదు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఒక అరుదైన అవార్డును సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. దేశం మొత్తం మీద ఉత్తమ ఐటీ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని ఉపయోగించి పౌరులకు మెరుగైన సేవలను అందించడంలో కేటీఆర్ పనితీరును మెచ్చుకుని ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగింది.

2020 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలకు గుర్తింపుగా స్కోచ్అవార్డు దక్కింది. కరోనా సమయంలో పౌర సేవలకు అంతరాయం కలుగకుండా ఆధునిక టెక్నాలజీని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో కేటీఆర్ సఫలీకృతమయ్యారు. ఇంతకు ముందు 2016 లో కూడా ఈ అవార్డును కేటీఆర్ అందుకోవడం విశేషం. అంతే కాకుండా రెండు సార్లు స్కోచ్ అవార్డు అందుకున్న ఏకైక మంత్రిగా రికార్డు సాధించారు. కాగా 2020 సంవత్సరానికి  ఈ గవర్నెన్స్ స్టేట్ అఫ్ ది ఇయర్ గా తెలంగాణ ఎంపికైంది. 2003 నుండి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనాల తరువాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ అభినందించారు.

ఈ గవర్నెన్స్ లో 2019 స్కోచ్ ర్యాంకింగ్స్ లో 10 వ స్థానంలో నిలిచిన తెలంగాణ 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వ కారణం. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలాగే 2019 లో 5 వ స్థానంలో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ 2020 లో మహారాష్ట్రతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు వరుసగా తరువాత స్థానాలలో నిలిచాయి. కాగా 2021 ర్యాంకింగ్ కు సంబంధించి మధింపు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థల పనితీరును కూడా మధింపు చేస్తామని స్కోచ్ అవార్డు కమిటీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: