తెలంగాణ ఉద్యమ గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ మళ్లీ రగులుతోంది. కొన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమాలతో ఓయూలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా... తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో క్యాంపస్ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా ఉద్యోగ భర్తీల విషయంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు వివాదమవుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు కూడా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఉద్యోగ భర్తీలపై చర్చకు ఓయూను కేంద్రంగా చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు.

ఉద్యోగాల కల్పనపై ఓయూ సాక్షిగా చర్చకు రెడీనా అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు.  సోమవారం ఉదయం 11 గంటలకు ఓయూకి కేటీఆర్‌ రావాలని రామచంద్రరావు సూచించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కేటీఆర్‌తో చర్చకు తాము సిద్ధమన్నారు. ఓయూకి వెళ్లేందుకు తమ నేతలకు పోలీసులు అనుమతించలేదన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరికి ఎలాగైనా వెళ్తామని రామచంద్రరావు తెలిపారు.

 తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎప్పుడు లేనంతగా హోరాహోరీగా సాగుతున్నాయి. వరుసగా ఎదురైన షాకులతో కుదేలైన అధికార పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని భావిస్తోంది. వరుస విజయాల పరంపరంను ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించి.. టీఆర్ఎస్ కు మరో ఝలక్ ఇవ్వాలని బీజేపీ దూకుడుగా వెళుతోంది. పట్టభద్రుల మద్దతు సంపాదించి రాష్ట్రంలో తాము బలంగా ఉన్నామని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఎక్కువగా నిరుద్యోగులే ఉంటారు... కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగాల భర్తీ చుట్టే రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.

నిరుద్యోగులు, యువత తమపై కోపంగా ఉన్నారని గ్రహించిన మంత్రి కేటీఆర్.. ఇటీవలే ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. గత ఆరేండ్లలో లక్షా 40 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేశామంటూ శాఖల వారిగా వివరాలు విడుదల చేశారు. కేటీఆర్ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసత్యాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గన్ పార్క్ దగ్గరకు చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ చేసి కాక రేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: