భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ అధికారం చేప‌ట్టి ఎనిమిది సంవ‌త్స‌రాలు పూర్తి కావ‌స్తున్నాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయ‌న వ్య‌వహార శైలి, మాట‌తీ, భావోద్వేగాలు, ప‌ద‌జాలం, ప‌ర్య‌ట‌న‌ల్లాంటివ‌న్నీ నిశితంగా ప‌రిశీలించిన ప్ర‌తివారికీ ఇప్పుడు ఒక‌టే సందేహం క‌లుగుతుంది. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విలో ఉంటూ రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చా?  లేదంటే దేశ ప్ర‌జ‌ల‌ను సొంత బిడ్డ‌ల్లా భావించి వారి  మ‌ధ్య ప్రాంతీయ విభేదాలేమీ లేకుండా వారి అభ్యున్న‌తికి, బాగోగులు చూసేలా ప‌రిపాల‌న చేయ‌వ‌చ్చా? అనే సందేహం క‌లుగుతోంది. పార్టీవేరు, అధికారం వేరు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి మీద దృష్టిపెట్టాలి. కానీ పార్టీని బ‌లోపేతం చేసుకుంటూ అన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఉంటే దేశం వెన‌క‌బ‌డిపోతుంది.

ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసే రాజకీయ సలహాదారులను పూర్తిస్థాయిలో విమ‌ర్శించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వారు ఎటువంటి స‌ల‌హాలిస్తారో తెలియ‌దు.. లేదంటే వారు ఇచ్చిన స‌ల‌హాల‌ను ప్ర‌ధాన‌మంత్రివంటివారు పాటించ‌కుండా సొంత నిర్ణ‌యాలు తీసుకుంటారో తెలియ‌ని ప‌రిస్థితి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరి, బెంగాల్ రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే.


ప్ర‌ధాన‌మంత్రి టీకా వేయించుకున్న విష‌యం తెలుసుక‌దా!. మోదీకి టీకా వేసింది పుదుచ్చేరికి చెందిన పి. నివేద అనే నర్సు, సహాయం చేస్తున్న మరొక నర్సు కేరళకు చెందినవారు. ఇక టీకా తీసుకుంటున్న సమయంలో ప్రధాని ధరించింది అస్సామీ కండువా ‘గమ్చా’. ఈ మూడు ప్రాంతాలూ త్వరలో ఎన్నికలకు వెళ్లేవి అని వేరే చెప్పనక్కరలేదు. క్రికెట్ ఆటగాడి అత‌ను ధ‌రించే దుస్తుల‌మీద  ఆసాంతం వ్యాపార చిహ్నాలు ఉంటాయి. ఎందుకంటే వాటితో వ్యాపార ఒప్పందాలుంటాయి కాబ‌ట్టి. టీకా కార్యక్రమం సందర్భంగా వైద్యులను, కోవాగ్జిన్ ఆవిష్కరణకు కారకులైన శాస్త్రజ్ఞులను ప్రశంసించడం అంతా బాగానే ఉంది కానీ, టీకా మందులో రాజకీయాన్ని మిళితం చేయకుండా మాత్రం ప్రధానమంత్రి ఉండలేరా? అని సందేహం కలుగుతుంది. టీకా వేయించుకున్నవారికి ఇచ్చే సర్టిఫికెట్‌పై ప్రధానమంత్రి ఫోటో అవసరమా? అలాగే ప్ర‌ధాన‌మంత్రి రూపం, వాచ‌కం అన్నీ రాజకీయ సందేశాలే అయితే ఎట్లా? ప‌్ర‌జ‌ల్లోకి ఏవిధ‌మైన సంకేతాలు వెళ‌తాయో ఒక‌సారి పాల‌కులు, వారికి స‌ల‌హాలిచ్చేవారు ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: