ఇండియాకు చైనా పక్కలో బళ్లెం లాంటిదే.. ఈ విషయంలో అనుమానం లేదు. అందుకే ఇండియా సాధ్యమైనంత వరకూ తన జాగ్రత్తలో ఉంటోంది. సరిహద్దుల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే.. చైనా ఇండియాపై అన్ని విధాలుగా దాడికి యత్నిస్తోందట. కేవలం సైన్యం పరంగానే కాదు.. టెక్నాలజీతోనూ దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోందట. ప్రయత్నించడం కాదు.. ఇప్పుటికే కొన్ని ట్రయల్స్ కూడా వేసిందట. ఈ భయంకరమైన వాస్తవాన్ని అమెరికా బయటపెట్టింది. నిజంగా నిజం..

గత ఏడాది ముంబై మొత్తం భారీ పవర్ ‌కట్‌ ఏర్పడిన సంగతి గుర్తుంది కదా.  అక్టోబరు 12న  ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదేదో  టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారంతా.. కానీ.. కాదట. ఆనాటి  ముంబై పవర్‌ కట్‌ వెనక ఉన్నది చైనా హ్యాకర్లేనట. ఈ విషయాన్ని ఓ అమెరికన్‌ సంస్థ బయటపెట్టింది.

ముంబయి కరెంట్‌ కట్‌కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. అంటే చైనా సరిహద్దుల్లోనే కాక మన దేశంలోనూ వివిధ మార్గాల్లో అలజడికి ప్రయత్నిస్తోందన్నమాట. ఇండియాతో  సరిహద్దు ఉద్రిక్తత సమయంలోనే  చైనా ఈ కుట్రకు ప్లాన్ చేసిందట. మన దేశ విద్యుత్తు‌ రంగాన్ని టార్గెట్ చేసిందట. భారత్‌కు చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, లోడ్‌ డిస్పాచ్‌‌ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయట.

చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్‌ఎకో గ్రూప్‌ అనే సంస్థ భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్లు, విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయట. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారట. వాళ్ల ఉద్దేశ్యం ఏంటో తెలుసా.. సరిహద్దులో భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని వార్నింగ్ ఇవ్వడమేనట.

మరింత సమాచారం తెలుసుకోండి: