అమీ తుమీ అంటున్నారు. విజయమో వీర స్వర్గమో అని పోరాడుతున్నారు. చావో రేవో అని కూడా తెగిస్తున్నారు. ఇదంతా విశాఖ మేయర్ ఎన్నికల కోసమే.  అటు అధికార పక్షం వైసీపీ, ఇటు విపక్షం టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేసి మరీ పీఠం పట్టేయాలని తెగ ఆరాటపడుతున్నాయి.

ఇపుడున్న అంచనాల ప్రకారం చూస్తే విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లలో గట్టి పట్టుంది. అక్కడ ఆ పార్టీ ఓటర్లు కూడా ఎక్కువగా  ఉన్నారు. దాంతో ఆ సీట్లు ఎటు నుంచి ఎటు అయినా సరే రావడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ పాత కాపు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవశాలి. పైగా మాజీ కార్పొరేటర్లు చాలా మంది ఆ పార్టీకి ఉన్నారు.

దాంతో టీడీపీకి కచ్చితంగా గెలిచే వార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటి అన్న లెక్క తీస్తే 13 దాకా తేలాయి. ఈ సీట్లను అనేక ఎన్నికల్లో వరసగా టీడీపీ గెలుచుకుంటూ  వస్తోంది. పైగా టీడీపీ సంప్రదాయ ఓటర్లు  ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు మరో  పార్టీని అసలు ఖాతరు చేయరు, ఓట్లు వేయరు. అలా కంచుకోటల లాంటి వార్డులు టీడీపీకి ఉండడంతో 13 నుంచి తన పరుగుపందేన్ని మొదలుపెట్టింది అనుకోవాలి.

ఇక మరో వైపు చూస్తే ఈ ఎన్నికలో మేయర్ పీఠం పట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 57 సీట్లుగా పేర్కొంటున్నారు. మొత్తం 98 వార్డులు విశాఖ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే సంఖ్య 113 దాకా చేరుతుంది అంటున్నారు. దాంతో 113లో సగం అంటే 57 సీట్లు ఎవరికి వస్తే వారే మేయర్ అవుతారు. ఇక టీడీపీ తమకు 58 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకుంటోంది. వైసీపీ అయితే 75 సీట్లు తమ ఖాతాలోకే అంటోంది. మొత్తానికి రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: