తెలంగాణలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఆరేండ్లుగా తమకు ఎదురులేకుండా ఉన్నగులాబీ పార్టీకి కొంత కాలంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ సొంత గడ్డ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పరాజయం అధికార పార్టీని షేక్ చేసింది. అది మరవకముందే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. కారు పార్టీలో మరింత కలవరం పుట్టించింది. బీజేపీ జోరు పెంచగా.. వరుస ఓటములతో ఢీలా పడిన టీఆర్ఎస్ కు... ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్ గా మారాయి. మండలి ఎన్నికల్లోనూ వ్యతిరేక ఫలితం వస్తే  టీఆర్ఎస్ కు కష్టాలు మరింత పెరుగుతాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తమకు జీవన్మరణ అంశంగా మారిన మండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కూతురు వాణిదేవిని రంగంలోకి దింపి విపక్షాలకు షాకిచ్చారు.
అంతేకాదు మండలి ఎన్నికల కోసం ట్రబుల్ షూటర్ గా పిలుచుుకునే మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారు గులాబీ బాస్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ గా ఆయనను నియమించారు. దీంతో ఎమ్మెల్సీ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు  హరీష్ రావు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రతి వంద మంది ఓటర్లకో ఇంచార్జ్ ను నియమించారు. హరీష్ రావు ఇంచార్జ్ గా రావడంతో టీఆర్ఎస్ కేడర్ లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. మొదట మండలి ఎన్నికలను లైట్ తీసుకున్న టీఆర్ఎస్ నేతలు... హరీష్ రావు ఎంట్రీ తర్వాత యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది.

నిజానికి కొంత కాలంగా పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది. ఆయనను పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. దీంతో ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఆయన సిద్దిపేట జిల్లా వరకే పరిమితం అవుతూ వస్తున్నారు.
ట్రబుల్ షూటర్ ను దూరం పెట్టడంపై  టీఆర్ఎస్  నేతల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. కావాలనే హరీష్ రావును పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. అయినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు మండలి ఎన్నికలు కీలకం కావడంతో హరీష్ రావును రంగంలోకి దించారనే చర్చ జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: