మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు వార్డు వాలంటీర్లను విధులకు దూరం చేయడం, వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం వంటి కండిషన్లు గతంలో పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు, వాలంటీర్ల జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అయితే తాజాగా మరోసారి నిమ్మగడ్డ వాలంటీర్ల విషయంలో హైకోర్టుని ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపిన ధర్మాసనం వాలంటీర్ల సెల్ ఫోన్లు ప్రత్యేక అధికారి వద్ద డిపాజిట్ చేయాలని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది.

మున్సిపల్‌ కమిషనర్లు నియమించిన అధికారుల వద్ద ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సెల్ ఫోన్లు అప్పగించాలని వార్డు వాలంటీర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. డ్యూటీలో భాగంగా ఫోన్లు అవసరమైతే... ఆయా కారణాలు చెబుతూ సంబంధిత అధికారి వద్ద ఫోన్లు తీసుకోవచ్చని అయితే, వాటిని ఆ అధికారి పర్యవేక్షణలోనే వినియోగించుకోవాలని సూచించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడే వాలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా సిఫారసు చేసేందుకు ఎస్‌ఈసీకి వెసులుబాటు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ అంగీకారం మేరకు ఈ ఆదేశాలిచ్చింది హైకోర్టు.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల తీరుపై భారీగా ఫిర్యాదులు అందాయి. అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో వివిధ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం ఉంది. ఆ డేటాను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో మొత్తం 68,913 మంది వాలంటీర్లు ఉన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా డేటాను దుర్వినియోగం చేయకుండా ఉంచేందుకు ఫోన్లను అప్పగించాలని ఆదేశించాంమని ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది కోర్టుకి వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, మున్సిపల్‌ కమిషనర్లు నామినేట్‌ చేసిన అధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని నిర్ణయించింది. వాలంటీర్లు ఫోన్లను వినియోగించకుండా పూర్తిగా అడ్డుకోవడం సరికాదని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: