తెలుగుదేశం పార్టీకి క్షేత్ర‌స్థాయిలో మంచి ప‌ట్టుంది. కార్య‌క‌ర్త‌ల ద‌న్ను ఉంది. వాణిజ్య కేంద్రంగా పేరొందిన ఆ పుర‌పాల‌క సంఘాన్ని చేజిక్కించుకోవ‌డానికి ఇంత‌క‌న్నా ఏం కావాలి. అందుకే ఇప్పుడు దానిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల క‌న్ను ప‌డింది. దీంతో ఇరుపార్టీల‌కు అక్క‌డ ఎన్నిక‌లు ప్ర‌తిష్గాత్మ‌కంగా మారాయి. వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌తో ఎవ‌రు పైచేయిగా నిల‌వ‌నున్నారో చూద్దాం.

శ్రీ‌కాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌. 2014 ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో అప్పట్లో టీడీపీ తరఫున బరిలో దిగిన కోత పూర్ణ చంద్రరావు చైర్మ‌న్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున వజ్జ బాబూరావు బరిలో ఉన్నారు. దీంతో అధికార పార్టీకి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం కోసం అధికార‌పార్టీ నేత‌లు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీకి సంబంధించిన ప‌నులిప్పిస్తామంటూ ప్ర‌లోభ‌ప‌రుచుకొని ప్ర‌తిప‌క్షాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి.

ఇదే జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఇక్కడి ఓటర్లు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టారు. బెందాళం అశోక్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో వైసీపీ నేతలు.. ఎలాగైనా సరే ‘పుర’ పోరులో విజయం సాధించి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. ఉప ముఖ్య‌మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ మునిసిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేయాలని శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల స్థానిక వైసీపీ  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో సమావేశమై మంతనాలు సాగించారు. టీడీపీ ఎమ్మెల్యే అశోక్ కూడా తనకు పట్టున్న ఇచ్ఛాపురం  పురపోరులో సత్తా చాటేందుకు అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తున్నారు. ఇప్పటివరకూ ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో ఐదు పాలక వర్గాలు ఎన్నికయ్యాయి. 1987లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 1995 ఎన్నికల్లో టీడీపీకి చెందిన కాళ్ల వెంకటలక్ష్మి చైర్‌ప‌ర్స‌న్‌గా వ్యవహరించారు. 2000, 2010 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో వైసీపీకి చెందిన పిలక రాజ్యలక్ష్మి చైర్‌ప‌ర్స‌న్‌గా వ్యవహరించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని పదిలం చేసుకొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: